బతికున్న భర్త చనిపోయాడని.. ఒడిశా రిలీఫ్ మనీ కోసం మహిళ అప్లికేషన్

ఒడిశా రైలు ప్రమాదంలో చనిపోయిన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన ఆర్థికసాయం కోసం ఒక మహిళ అడ్డదారి తొక్కింది.

Update: 2023-06-07 12:23 GMT

భువనేశ్వర్: ఒడిశా రైలు ప్రమాదంలో చనిపోయిన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన ఆర్థికసాయం కోసం ఒక మహిళ అడ్డదారి తొక్కింది. కటక్ జిల్లాలోని మణిబండకు చెందిన గీతాంజలి దత్తా బాలాసోర్ జిల్లాలోని బహనాగ రైల్వే స్టేషన్ కు వెళ్ళింది. ఒక డెడ్ బాడీని చూపించి.. అది తన భర్త బిజయ్ దత్తాదే అని చెప్పింది. అయితే డాక్యుమెంట్ల వెరిఫికేషన్ తర్వాత ఆమె చెప్పేది అబద్ధమని అధికారులు గుర్తించారు. దీంతో పోలీసులు ఆమెకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపించారు. అయితే ఈ విషయం ఆమె భర్త బిజయ్ దత్తాకు తెలిసింది. దీంతో అతడు మానియాబంధ పోలీస్ స్టేషన్‌ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.

ప్రజాధనాన్ని లాక్కోవడానికి యత్నించినందుకు.. తాను బతికి ఉన్నా చనిపోయానని నిరూపించేందుకు ట్రై చేసినందుకు గీతాంజలిపై కఠిన చర్యలు తీసుకోవాలని బిజయ్ డిమాండ్ చేశారు. అరెస్టుకు భయపడి ఆ మహిళ ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. గత 13 ఏళ్లుగా గీతాంజలి దత్తా, బిజయ్ దత్తా విడివిడిగా జీవిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఇలాంటి నకిలీ హక్కుదారులు వస్తే కఠిన చర్యలు తీసుకోవాలని రైల్వే, ఒడిశా పోలీసులను ఒడిశా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ పీకే జెనా ఆదేశించారు. రైలు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ఒడిశా సర్కారు రూ. 5 లక్షలు, ప్రధాని మోడీ రూ. 2 లక్షలు, రైల్వే శాఖ రూ.10 లక్షల పరిహారాన్ని ప్రకటించింది.

Tags:    

Similar News