సందేశ్‌ఖాలీ ఘటనపై మమతా, రాహుల్ స్పందించాలి: బీజేపీ

బెంగాల్‌లోని 24 నార్త్ పరగణాస్ జిల్లాలో పలువురు మహిళలపై తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత షాజహాన్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దీంతో సందేశ్‌ఖాలీ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Update: 2024-02-21 08:12 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బెంగాల్‌లోని 24 నార్త్ పరగణాస్ జిల్లాలో పలువురు మహిళలపై తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత షాజహాన్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దీంతో సందేశ్‌ఖాలీ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఆరోపణలపై విచారణ జరపాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. తాజాగా ఈ ఇష్యూపై బీజేపీ నేత రవిశంకర ప్రసాద్ సీఎం మమతా బెనర్జీపై మండిపడ్డారు. సందేశ్‌ఖాలీ ఘటనలో మమతా కావాలనే ఏదో దాస్తున్నారని ఆరోపించారు. తన రాజకీయ ప్రతిష్టను కాపాడుకోవడానికి బెంగాల్‌లో మహిళల గౌరవాన్ని కించ పరుస్తున్నారని విమర్శించారు. ‘సందేశ్‌ఖాలీ సమస్య అత్యంత తీవ్రమైంది. ఆ ప్రాంతంలో మహిళలపై జరిగిన దాడులు ప్రజాస్వామ్యానికే అవమానకరం. దీనిపై మమతా బెనర్జీ ఏదో దాస్తున్నారు. అందుకే బీజేపీ నేతలను సందేశ్ ఖాలీలోకి వెళ్లనివ్వడం లేదు’ అని వ్యాఖ్యానించారు.

సమస్య ఇంత తీవ్రంగా ఉన్నా దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మౌనం వహించడం సరికాదని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ‘కాంగ్రెస్, సీపీఎంలు మౌనంగా ఉన్నాయి? అయితే సీపీఎంకి చెందిన మహిళా నాయకురాలు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. కానీ ఘటనను వ్యతిరేకించలేదు. బహిరంగంగా ఎటువంటి వ్యాఖ్యలుు చేయలేదు’ అని చెప్పారు. ఘటనపై విచారణ చేపట్టి టీఎంసీ నేత షాజహాన్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు సిక్కు పోలీసు అధికారిని ఖలిస్థానీ అని పిలిచినందుకు బీజేపీ నేతలపై కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి మండిపడ్డారు. బీజేపీ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు తెలిపారు. వారికి పశ్చిమ బెంగాల్ సంస్కృతి పై అవగాహన లేదని విమర్శించారు. కాషాయ పార్టీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

Tags:    

Similar News