Mamata banerjee: బీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు కోరుతూ నిర్మలా సీతారామన్‌కు మమతా బెనర్జీ లేఖ

నిత్యావసర వస్తువులపై జీఎస్టీ విధించడం వల్ల సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పడుతోందని లేఖలో స్పష్టం చేశారు.

Update: 2024-08-05 16:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జీవిత బీమా, ఆరోగ్య బీమా ప్రీమియంలపై విధిస్తున్న వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) ఉపసంహరించుకోవాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు దీదీ లేఖ రాశారు. నిత్యావసర వస్తువులపై జీఎస్టీ విధించడం వల్ల సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పడుతోందని లేఖలో స్పష్టం చేశారు. ముఖ్యంగా జీవిత బీమా, వైద్య బీమా ప్రీమియంలపై 18 శాతం చొప్పున జీఎస్టీ రేటు కింద ఉన్నాయి. 18 శాతం జీఎస్టీ కారణంగా చాలామంది కొత్తగా పాలసీలను తీసుకునేందుకు లేదా ఇప్పటికే ఉన్న బీమా కవరేజీని కొనసాగించకుండా చేసేలా ఉందని, దానివల్ల ప్రజలు అనవసర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని వివరించారు. దీంతో పాటు కొత్త పన్ను విధానంలో ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్లు 80సీ, 80డీ కింద ఉన్న ప్రామాణిక తగ్గింపునకు సంబంధించి కొత్త నిబంధనలను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని విన్నవించారు. ఈ తగ్గింపు పాత పన్ను విధానంలో మాత్రమే అందుబాటులో ఉంది. 

Tags:    

Similar News