‘ఇండియా’లో బీటలు.. కాంగ్రెస్‌కు పంజాబ్, బెంగాల్ సీఎంల షాక్.. స్వరం మార్చిన నితీశ్
దిశ, నేషనల్ బ్యూరో: ఇండియా కూటమిలోని పలు కీలక రాజకీయ పార్టీలు సీట్ల పంపకాలపై తలోదారిలో పయనిస్తున్నాయి.
దిశ, నేషనల్ బ్యూరో: ఇండియా కూటమిలోని పలు కీలక రాజకీయ పార్టీలు సీట్ల పంపకాలపై తలోదారిలో పయనిస్తున్నాయి. కూటమిని లీడ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి, తమకు మధ్య గ్యాప్ ఉందనే స్పష్టమైన సంకేతాలను ఇచ్చేలా బహిరంగ ప్రకటనలు చేస్తున్నాయి. ఈ ప్రకటనలతో పశ్చిమబెంగాల్, పంజాబ్‌లలో సీట్ల సర్దుబాటు వ్యవహారం ప్రశ్నార్ధకంగా మారింది. బెంగాల్‌లో ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతామని ఆ రాష్ట్ర సీఎం, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) చీఫ్ మమతా బెనర్జీ ప్రకటించగా.. పంజాబ్‌లో కాంగ్రెస్‌తో పొత్తు ప్రసక్తే లేదని ఆ రాష్ట్ర సీఎం భగవంత్ సింగ్ మాన్ వెల్లడించారు. ఒకేరోజు (బుధవారం) వెలువడిన ఈ సంచలన వ్యాఖ్యలు హస్తం పార్టీకి షాకిచ్చాయి. ఎన్నికల ఫలితాల తర్వాతే ఇండియా కూటమిలో చేరడంపై ఆలోచిస్తామని దీదీ స్పష్టం చేశారు. బెంగాల్‌లో సీట్ల షేరింగ్‌పై కాంగ్రెస్‌తో జరిగిన చర్చలు విఫలమయ్యాయని తెలిపారు. రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాల్లో పోటీచేసి బీజేపీని ఓడిస్తామని మమత చెప్పారు. కాంగ్రెస్‌తో ఇక నుంచి టీఎంసీకి ఎటువంటి సంబంధం ఉండదన్నారు. ‘‘రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర గురువారం పశ్చిమ బెంగాల్ మీదుగా వెళ్లాల్సి ఉన్నా మాకు ఇప్పటిదాకా కనీసం సమాచారం ఇవ్వలేదు. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలోకి వచ్చినపుడు నాకు చెప్పాల్సిన బాధ్యత వారికి లేదా ?’’ అని దీదీ ఆవేదన వ్యక్తం చేశారు.
దీదీని ప్రసన్నం చేసుకునే పనిలో కాంగ్రెస్...
మరోవైపు కాంగ్రెస్ మాత్రం దీదీని ప్రసన్నం చేసుకునే పనిలో పడింది. ‘‘మమతా బెనర్జీ లేని ఇండియా కూటమిని ఊహించలేం’’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరాం రమేశ్ అన్నారు. అసోంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇండియా కూటమికి టీఎంసీ కీలక భాగస్వామి అని చెప్పారు. టీఎంసీతో ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని, సీట్ల సర్దుబాటుపై ఏర్పడిన ప్రతిష్టంభన త్వరలోనే తొలగిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్‌లో రాహుల్ గాంధీ యాత్రపై తనకు సమాచారం ఇవ్వలేదని మమతా బెనర్జీ చేసిన ఆరోపణపై జైరాం రమేశ్ స్పందిస్తూ.. భారత్ జోడో న్యాయ్ యాత్రకు అన్ని పార్టీలను ఆహ్వానించినట్టు తెలిపారు. ఈ వ్యవహారంపై ఢిల్లీకి చెందిన ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ స్పందిస్తూ.. ‘‘బెంగాల్‌లో టీఎంసీ అతి పెద్ద పార్టీ. కాంగ్రెస్, వామపక్షాలు ఎప్పటినుంచో టీఎంసీకి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. ఈనేపథ్యంలో అకస్మాత్తుగా టీఎంసీతో సీట్ల పంపకం కొంచెం కష్టమైన వ్యవహారమే’’ అని చెప్పారు. బిహార్‌కు చెందిన ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా స్పందిస్తూ.. ‘‘ఏదైనా సమస్య ఉంటే కూటమి పరిష్కరిస్తుంది. అందుకోసం మమతా బెనర్జీ కొంత సమయమిచ్చి వేచి చూడాల్సింది. బహుశా ఏదైనా నిర్దిష్ట పరిస్థితిలో దీదీ ఆ ప్రకటన చేసి ఉండొచ్చు’’ అని పేర్కొన్నారు.
మాకు కాంగ్రెస్‌తో సంబంధం లేదు : పంజాబ్ సీఎం మాన్
పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీతో ఆప్‌కు ఎలాంటి సంబంధం ఉండబోదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆప్ కీలక నేత భగవంత్ సింగ్ మాన్ అన్నారు. రాష్ట్రంలోని మొత్తం 13 లోక్‌సభ స్థానాలను తమ పార్టీ గెల్చుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బెంగాల్‌లో ఒంటరి పోరుకు దిగుతామని దీదీ చేసిన ప్రకటనపై భగవంత్ సింగ్ మాన్ స్పందిస్తూ.. ‘‘బహుశా చర్చలు ఫలప్రదంగా లేకపోవడం వల్ల దీదీ అలా మాట్లాడి ఉంటారు. పంజాబ్‌లో అలాంటిదేం లేదు. మాకు కాంగ్రెస్‌తో సంబంధం లేదు. మా రాష్ట్రంలోని 13 లోక్‌సభ స్థానాలకు పోటీచేసేందుకు 40 మంది అభ్యర్థుల పేర్లు వచ్చాయి. ఒక్కో స్థానం నుంచి సగటున ముగ్గురు, నలుగురు అభ్యర్థులు పోటీపడుతున్నారు. గెలుపే మా లక్ష్యం’’ అని చెప్పారు.
కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న.. కాంగ్రెస్ పట్టించుకోలేదు : నితీష్
మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న ప్రకటించడంపై బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ స్పందించారు. కుటుంబ రాజకీయాలంటే కర్పూరీ ఠాకూర్‌కు ఇష్టముండేది కాదని.. ఆయన ఎన్నడూ కుటుంబ సభ్యులను రాజకీయాల్లో ప్రోత్సహించలేదని నితీశ్ గుర్తు చేశారు. కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న ఇవ్వాలని కొన్ని దశాబ్దాలుగా బిహార్ రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నా.. కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టించుకోలేదని చెప్పారు. కర్పూరీ ఠాకూర్‌కు భారత రత్న ప్రకటించినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర సర్కారుకు బిహార్ సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ఈ వ్యాఖ్యలతో ఇండియా కూటమిలో ఉన్న బిహారీ పార్టీ జేడీయూ కూడా కాంగ్రెస్‌కు దూరమవుతోందనే అనుమానాలు అలుముకున్నాయి. ప్రస్తుత బిహార్ సర్కారులో లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన ఆర్జేడీ, నితీశ్‌కు చెందిన జేడీయూ, కాంగ్రెస్ భాగస్వాములుగా ఉన్నాయి. వాస్తవానికి అసెంబ్లీలో మెజారిటీ సీట్లు ఆర్జేడీకే ఉన్నాయి. అయినప్పటికీ తక్కువ సీట్లు కలిగిన నితీశ్ కుమార్ సీఎం పదవిని చేపట్టారు. లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ డిప్యూటీ సీఎం అయ్యారు. దీన్ని వ్యతిరేకిస్తున్న లాలూ తన కొడుకు తేజస్విని సీఎం చేయాలని భావిస్తున్నారు. ఈనేపథ్యంలోనే కుటుంబ రాజకీయాల అంశాన్ని నితీష్ కుమార్ ఇప్పుడు తెరపైకి తెచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Read More..
తెలంగాణ పాలిటిక్స్‌లోకి ‘మాస్టర్ మైండ్’ రీ ఎంట్రీ.. CM రేవంత్‌కు కీలక సూచనలు..!