Mallikarjun Kharge: ఖర్గే కుటుంబం కీలక నిర్ణయం..!
కర్ణాటక (Karnataka)లో ముడా స్కాం(MUDA scam) రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక (Karnataka)లో ముడా స్కాం(MUDA scam) రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కాగా.. ఇలాంటి టైంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జునఖర్గే ఫ్యామిలీ కీలక నిర్ణయం తీసుకుంది. ఖర్గే కుటుంబానికి చెందిన సిద్ధార్థ విహార్ ట్రస్ట్‌కు గతంలో కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియాస్ డెవలప్‌మెంట్ బోర్డ్ (KIADB) కేటాయించిన ఐదు ఎకరాల భూమిని తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం, ముడా స్కాంపై విచారణ జరుగుతున్న టైంలో ఖర్గే ఫ్యామిలీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. సిద్ధార్థ ట్రస్ట్‌లో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ఆయన అల్లుడు రాధాకృష్ణ, కుమారుడు రాహుల్ ఖర్గే మొదలైన వారు ట్రస్టీలుగా ఉన్నారు. అయితే ఈ స్థలం కేటాయింపులో అవకతవకలు, అవినీతి జరిగిందని ఆరోపిస్తూ దినేష్ కల్లహల్లి అనే వ్యక్తి కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్‌కు అధికారికంగా ఫిర్యాదు చేశారు.
ప్రతిపక్షాల విమర్శలు
సిద్ధార్థ్ ట్రస్ట్ కు ఐదుకరాల భూమిని మంజూరు చేయడాన్ని ప్రతిపక్షాలు ఖండించాయి. ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని బీజేపీ నేత అణిత్ మాల్వియా మండిపడ్డారు. అయితే, కర్ణాటక మంత్రి ఎంబీ పాటిల్ మాత్రం ప్రతిపక్షాల విమర్శలపై కౌంటర్ ఇచ్చారు. రాహుల్ ఖర్గే దరఖాస్తు ప్రకారం అర్హతలు పరీక్షించిన తరువాతే మెరిట్ ఆధారంగా భూమి కేటాయించినట్లు పేర్కొన్నారు. ఇకపోతే, ముడా స్కాం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Siddaramaiah)పై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. అయితే, ఈ కేసు నడుస్తుండగా ఖర్గే ఫ్యామిలీ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.