Maldives: భారత్ కు ధన్యవాదాలు తెలిపిన మాల్దీవుల అధ్యక్షుడు

మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ(Maldives President) భారతదేశానికి ధన్యవాదాలు తెలిపారు.

Update: 2024-07-29 03:49 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ(Maldives President) భారతదేశానికి ధన్యవాదాలు తెలిపారు. మాల్దీవుల స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఎనిమిది నెలల 'దౌత్య విజయాన్ని', విదేశాంగ విధాన పరిపాలనను ఆయన ప్రశంసించారు. రుణ చెల్లింపులను సులభతరం చేసిన నేపథ్యంలో భారత్ కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే రుణ చెల్లింపుల్లో తమకు మద్దతు నిలిచిన చైనాకు(China) కూడా కృతజ్ఞతలు తెలిపారు. రుణ చెల్లింపుల సడలింపుల వల్ల దేశ ఆర్థిక సార్వభౌమాధికారాన్ని నిర్ధారించేందుకు వీలు ఉంటుందన్నారు. విదేశీ మారక నిల్వల కొరతను నొక్కి చెప్పిన ఆయన.. భారత్, చైనాతో కరెన్సీ మార్పిడి ఒప్పందాలపై చర్చలు జరుపుతోందన్నారు.

స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం

ఢిల్లీ, మాలే మధ్య బలమైన సంబంధాలు నెలకొనాలని ముయిజ్జూ ఆశించారు. స్వేఛ్చాయుత వాణిజ్య ఒప్పందం కుదరాలని ఆశాభావం వ్యక్తం చేశారు. యూకేతో కూడా స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందంపై(Free Trade Agreement) చర్చలు జరుపుతున్నట్లు ప్రకటించారు. అయితే, ముయిజ్జూ అధికారంలోకి రాగానే.. భారత్, మాల్దీవుల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ(PM Modi) ప్రమాణస్వీకారం చేసిన కార్యక్రమానికి ముయిజ్జూ హాజరయ్యారు. ఇప్పుడు, భారత్ కు ధన్యవాదాలు తెలిపారు. ఇకపోతే, గతంలో మోడీ లక్షద్వీప్ పర్యటనలో ఉండగా ముగ్గురు మాల్దీవుల మంత్రులు అవమానకర వ్యాఖ్యలు చేయడంతో ఢిల్లీ, మాలే మధ్య వివాదం చెలరేగింది. ఈ విషయం దౌత్యపరమైన వివాదంగా మారింది. కాగా.. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రారంభంలో మాల్దీవులను సందర్శించే భారతీయుల సంఖ్య 33 శాతం తగ్గిందని మాల్దీవుల పర్యాటక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.


Similar News