ఢిల్లీ చేరుకున్న మాల్దీవులు అధ్యక్షుడు ముయిజ్జూ, మారిషస్ ప్రధాని

గత కొంత కాలంగా భారత్-మాల్దీవుల మధ్య సంబంధాలు దిగజారిన విషయం తెలిసిందే.

Update: 2024-06-09 06:43 GMT

దిశ, నేషనల్ బ్యూరో: గత కొంత కాలంగా భారత్-మాల్దీవుల మధ్య సంబంధాలు దిగజారిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల దేశంలో జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించగా వరుసగా మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ వేడుకకు పలు దేశాల నాయకులను ఆహ్వనించారు. వీరిలో మాల్దీవులు అధ్యక్షుడు సైతం ఉన్నారు. భారత ఆహ్వానాన్ని అంగీకరించిన ఆయన ఆదివారం మోడీ ప్రమాణస్వీకారానికి హాజరయ్యేందుకు ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో దిగిన ఆయనకు భారత ప్రభుత్వం తరఫున అధికారులు స్వాగతం పలికారు.

విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్ పోస్ట్‌లో వ్యాఖ్యానిస్తూ, భారత్-మాల్దీవులు సముద్ర భాగస్వాములు, సన్నిహిత పొరుగు దేశాలు, ప్రెసిడెంట్ ముయిజ్జూ‌కు స్వాగతం అని అన్నారు. అంతకుముందు మాల్దీవులు అధ్యక్షుడు ముయిజ్జూ ఒక పోస్ట్‌లో వ్యాఖ్యానిస్తూ, 2024 భారత సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి,బీజేపీకి దాని నేతృత్వంలోని ఎన్డీయేకు అభినందనలు తెలిపారు. ఇదిలా ఉంటే మారిషస్ ప్రధానమంత్రి ప్రవింద్ జుగ్నాథ్ సైతం ఆదివారం ఢిల్లీకి చేరుకున్నారు. ఆయనకు కూడా భారత అధికారులు స్వాగతం పలికారు. శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే కూడా న్యూఢిల్లీకి చేరుకుంటారని శ్రీలంక ప్రభుత్వం తెలిపింది. సాయంత్రం వరకు విదేశీ నేతలు ఢిల్లీకి చేరుకోనున్నారు, వారంతా కూడా 7.15కు రాష్ట్రపతి భవన్‌లో జరిగే మోడీ ప్రమాణస్వీకారంలో పాల్గొంటారు.


Similar News