మరోసారి పునరావృతం కాకుండా చూస్తాం: మాల్దీవుల మంత్రి

అటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.

Update: 2024-05-09 14:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన వివాదం కొనసాగుతున్న వేళ మాల్దీవుల విదేశీంగ మంత్రి మూసా జమీర్ భారత పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీపై వారి మంత్రులు చేసిన వ్యాఖ్యలకు బదులిచ్చారు. మంత్రుల వ్యాఖ్యలకు, ప్రభుత్వానికి సంబంధం లేదని, అది ప్రభుత్వ వైఖరి కాదని గుర్తించాలని కోరారు. ఇదే సమయంలో అటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. గురువారం ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా సోషల్ మీడియా ఈ విషయం ఎక్కువ చర్చకు దారితీసింది. అపార్థం చేసుకోవడం కారణంగా సమస్య జటిలమైంది. అయితే, ఇరు ప్రభుత్వాలు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాయి. ఆ సమస్యను దాటేశామని భావిస్తున్నట్టు చెప్పారు. ఇదే సమయంలో మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మయిజూ చైనా పర్యటనపై స్పందించిన ఆయన అది అంతర్గత భౌగోళిక రాజకీయ మార్పు కంటే సౌలభ్యం మీద ఆధారపడి ఉంటుందన్నారు. చైనాతో సైనిక ఒప్పందాలకు సంబంధించిన ఊహాగానాలను తోసిపుచ్చారు. చైనాతో సైనిక ఒప్పందం ఉందని తాను అనుకోవట్లేదన్నారు. ఇక, గురువారం ఢిల్లీలో భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌ ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన జైశంకర్.. ఇరు దేశాల ప్రయోజనాలు, పరస్పర గౌరవంపై ఆధారపడి సంబంధాలు ఉంటాయని, తాము పొరుగు దేశాలకు ప్రాధాన్యం ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. మాల్దీవులకు అవసరమైన ప్రతిసారి ఆదుకున్నామని పేర్కొన్నారు.

Tags:    

Similar News