లోక్‌సభ నుంచి బహిష్కరణపై సుప్రీంను ఆశ్రయించిన మహువా
తన లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా సుప్రీంకోర్టులో సోమవారం పిటిషన్ వేశారు
న్యూఢిల్లీ: తన లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా సుప్రీంకోర్టులో సోమవారం పిటిషన్ వేశారు. ఆధారాలు లేకుండా, తనపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేయకుండానే చర్యలు తీసుకున్నారని ఈ పిటిషన్‌లో ఆమె ఆరోపణలు చేశారు.
అదానీ గ్రూప్ గురించి లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలతో మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు పడింది. ఈ అంశంపై తొలుత బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో హీరానందానీ అప్రూవర్‌గా మారారు.
ఈ పరిణామాలపై నవంబర్ 9న లోక్‌సభ ఎథిక్స్ కమిటీ విచారణ జరిపి హీరానందానీ, నిశికాంత్ దూబే ఆరోపణలు నిజమేనని తేల్చింది. మొయిత్రాను లోక్‌సభ నుంచి బహిష్కరించాలని ప్రతిపాదిస్తూ నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా లోక్‌సభ నుంచి మహువాను బహిష్కరిస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం (డిసెంబర్ 8న) ప్రకటించారు.