Mahesh Raut: ఎల్గార్ పరిషత్ కేసులో మహేష్ రౌత్‌కు ఊరట.. ఎన్ఐఏ కోర్టు బెయిల్
ఎల్గార్ పరిషత్-మావోయిస్టు సంబంధాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహేష్ రౌత్‌కు ఊరట లభించింది.

దిశ, నేషనల్ బ్యూరో: ఎల్గార్ పరిషత్ (Elgar parishad)మావోయిస్టు సంబంధాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహేష్ రౌత్ (Mahesh raut)కు ఊరట లభించింది. లా పరీక్షలకు హాజరయ్యేందుకు గాను ఆయనకు ఏప్రిల్ 20 నుంచి మే 16వరకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(NIA) కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఎల్ఎల్‌బీ రెండో సెమిస్టర్ పరీక్షలకు అటెండ్ అవ్వడానికి ప్రత్యేక న్యాయమూర్తి చకోర్ భావిస్కర్ రౌత్‌కు రూ.50,000 వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ ఇచ్చారు. అలాగే బెయిల్ టైంలో మహేష్ తన అడ్రస్‌కు సంబంధించిన రుజువుతో పాటు యాక్టివ్ మొబైల్ నంబర్‌ను జైలు అధికారులకు, దర్యాప్తు సంస్థకు అందజేయాలని ఆదేశించారు. పరీక్షలు ముగిసిన వెంటనే జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలని పేర్కొన్నారు.
కాగా, 2017 డిసెంబర్ 31న మహారాష్ట్ర (Maharashtra)లోని పూణేలో జరిగిన ఎల్గార్ పరిషత్ సమావేశంలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారనే ఆరోపణలున్నాయి. ఆ మరుసటి రోజు భీమా కోరెగావ్‌లో హింస చెలరేగింది. దీంతో మహేశ్ సహా16 మంది కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. ఈ సమావేశానికి మావోయిస్టుల మద్దతు ఉందని కూడా ఆరోపణలున్నాయి. దీంతో ఈ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో భాగంగా మహేష్‌ను 2018లో అరెస్ట్ చేయగా అప్పటి నుంచి ఆయన ముంబైలోని తలోజా జైలులో ఉన్నారు.