Maharashtra polls: మహారాష్ట్రలో ముగిసిన నామినేషన్ల పర్వం

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ నామినేషన్ల పర్వం ముగిసింది. కాగా.. 288 అసెంబ్లీ స్థానాల్లో పోటీపడేందుకు మొత్తం 7,994 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో దిగినట్లుగా ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు.

Update: 2024-11-01 05:21 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ నామినేషన్ల పర్వం ముగిసింది. కాగా.. 288 అసెంబ్లీ స్థానాల్లో పోటీపడేందుకు మొత్తం 7,994 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో దిగినట్లుగా ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. అయితే, అందులో 921 మంది నామినేషన్ పేపర్లను తిరస్కరించినట్లు మహారాష్ట్ర ఎన్నికల అధికారులు తెలిపారు. ఇక, అభ్యర్థుల నామినేషన్‌ దాఖలు ప్రక్రియ అక్టోబర్‌ 22న ప్రారంభం కాగా.. అక్టోబర్ 29తో ముగిసింది. అక్టోబర్‌ 30న నామినేషన్‌ పత్రాల పరిశీలన పూర్తయ్యింది. నవంబర్ 4న నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ. మహారాష్ట్రలో మొత్తం 9.7 కోట్ల మంది ఓటర్లు (Maharashtra Voters) ఉన్నారని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. అయితే, ఇందులో తొలి ఓటర్లు కేవలం 2శాతం మాత్రమే. ఇక, 5 కోట్ల మంది పురుష ఓటర్ల కాగా.. 4.6 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 18-19 ఏళ్ల వయసు గల తొలి ఓటర్లు 22.22 లక్షల మంది అని ఈసీ (Election Commission) తెలిపింది. ఇక, శతాధిక వృద్ధులు 21,089 మంది ఉన్నారని పేర్కొంది. గత ఎన్నికలతో పోలిస్తే మహారాష్ట్రలో ఓటర్ల సంఖ్య దాదాపు 72 లక్షలకు పెరిగింది.

ఒకే దశలో పోలింగ్

ఇకపోతే, 288 మంది ఎమ్మెల్యేలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి ఒకే విడతలో నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. నవంబరు 23న ఫలితాలను ప్రకటించనున్నారు. ప్రస్తుతం బీజేపీ, శివసేన, ఎన్సీపీలతో కూడిన మహాయుతి ప్రభుత్వం అధికారంలో ఉంది. కాగా.. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి మళ్లీ అధికారంలోకి రావాలని కాంగ్రెస్‌, ఎన్సీపీ (ఎస్పీ), శివసేన (యూబీటీ)లతో కూడిన ప్రతిపక్ష మహావికాస్‌ అఘాడీ కూటమి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.


Similar News