Maharashtra Elections: రెండు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రె
2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్ఎస్ కేవలం ఒక సీటును మాత్రమే గెలుచుకుంది.
దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) అధినేత రాజ్ ఠాక్రె రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రెండు స్థానాలకు అభ్యర్థుల పేర్లను సోమవారం ప్రకటించారు. వారిలో బాలా నంద్‌గావ్కర్ ముంబైలోని శివాది అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనుండగా, దిలీప్ ధోత్రే పండర్‌పూర్ నుంచి బరిలోకి దిగనున్నారు. అంతకుముందు ఓ ప్రకటనలో ఏడాది ఆఖర్లో జరగబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో స్వంతంగా 200 నుంచి 250 స్థానాల్లో పోటీ చేయనున్నట్టు రాజ్ ఠాక్రె ప్రకటించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్ఎస్ కేవలం ఒక సీటును మాత్రమే గెలుచుకుంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చింది. కాగా, ఇటీవల రాజ్ ఠాక్రె రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండెతో సమావేశమై ప్రజల సమస్యలు, పలు గృహ నిర్మాణ ప్రాజెక్టులపై చర్చించారు. బీడీడీ చాల్ పునరాభివృద్ధి, పోలీసు హౌసింగ్ కాలనీల పునరాభివృద్ధి, మరికొన్ని హౌసింగ్ ప్రాజెక్టులు వంటి హౌసింగ్‌కు సంబంధించిన పలు అంశాలపై ఎంఎన్‌ఎస్ ప్రతినిధి బృందంతో రాజ్ ఠాక్రే సీఎం ఏక్‌నాథ్ షిండేను కలిశారు. ఈ సమావేశానికి మహారాష్ట్రలోని కొందరు సీనియర్లు, ప్రభుత్వ అధికారులు హాజరయ్యారని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. 288 నియోజకవర్గాల్లో మహారాష్ట్ర శాసనసభకు ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. భారత ఎన్నికల సంఘం ఖచ్చితమైన తేదీలను ఇంకా ప్రకటించాల్సి ఉంది.