నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ క్రైమ్ నోటీసులు.. కారణమేంటి?

ప్రముఖ నటి, స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా చిక్కుల్లో పడింది. ఐపీఎల్ 2023 మ్యాచులను నిబంధనలకు విరుద్ధంగా మహాదేవ్ బెట్టింగ్ యాప్‌కు అనుబంధంగా ఉన్నఫెయిర్ ప్లే యాప్‌లో

Update: 2024-04-25 05:11 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ప్రముఖ నటి, స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా చిక్కుల్లో పడింది. ఐపీఎల్ 2023 మ్యాచులను నిబంధనలకు విరుద్ధంగా మహాదేవ్ బెట్టింగ్ యాప్‌కు అనుబంధంగా ఉన్న ఫెయిర్ ప్లే యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేసినందుకు గాను ఆమెకు మహారాష్ట్ర సైబర్ క్రైం పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 29న తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. తమన్నా చేసిన ఈ పని కారణంగా తమకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని వయాకామ్ ఫిర్యాదు చేసింది. దీంతో ఫెయిర్ ప్లే యాప్‌పై మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే తమన్నా ఫెయిర్ ప్లే యాప్‌ను ప్రమోట్ చేసిందని అందుకే ఆమెను విచారణకు పిలిచినట్టు తెలుస్తోంది.

ఈ కేసులో గాయకుడు బాద్ షా, నటులు సంజయ్ దత్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ల మేనేజర్ల వాంగ్మూలాలను మహారాష్ట్ర సైబర్ సెల్ ఇప్పటికే నమోదు చేసింది. సంజయ్ దత్‌కు కూడా ఈనెల 23న సమన్లు ​​అందగా ఆయన విచారణకు గైర్హాజరయ్యారు. అయితే బిజీ షెడ్యూల్ కారణంగా తన స్టేట్ మెంట్ రికార్డు చేయడానికి మరొక తేదీ నిర్ణయించాలని కోరారు. కాగా, ఫెయిర్‌ప్లే అనేది మహాదేవ్ ఆన్‌లైన్ గేమింగ్ యాప్ అనుబంధ అప్లికేషన్. ఇది క్రికెట్, కార్డ్ గేమ్స్, బ్యాడ్మింటన్, టెన్నిస్, ఫుట్‌బాల్ వంటి గేమ్‌లలో అక్రమ బెట్టింగ్ నిర్వహిస్తోంది. దీనిలో జరిగిన మనీలాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తు చేస్తోంది. 

Tags:    

Similar News