Maharashtra CM : సీఎం ఎంపిక.. కుమారుడికి డిప్యూటీ సీఎం పదవిపై షిండే కీలక వ్యాఖ్యలు

దిశ, నేషనల్ బ్యూరో : ‘కౌన్ బనేగా మహారాష్ట్ర సీఎం’(Maharashtra CM) అనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతున్న తరుణంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఏక్‌నాథ్‌ షిండే(Eknath Shinde) కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-12-01 15:17 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ‘కౌన్ బనేగా మహారాష్ట్ర సీఎం’(Maharashtra CM) అనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతున్న తరుణంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఏక్‌నాథ్‌ షిండే(Eknath Shinde) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం జరగనున్న బీజేపీ(BJP) శాసనసభాపక్ష సమావేశంలో సీఎంను ఎంపిక చేస్తారని ఆయన వెల్లడించారు. ఈనెల 5న నూతన సీఎం ప్రమాణ స్వీకారం కచ్చితంగా జరుగుతుందన్నారు. ఆదివారం మీడియా సమావేశంలో షిండే మాట్లాడారు. సీఎం ఎంపిక విషయంలో బీజేపీ హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అని.. దానికి బేషరతుగా తన మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ‘‘సీఎం ప్రమాణ స్వీకారం తేదీ, వేదిక ఖరారైనా .. సీఎం ఎవరో ఇంకా ప్రకటించలేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి కదా’’ అని షిండేను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి ఆయన బదులిస్తూ.. ‘‘దాని గురించి మీరు ఎందుకు చింతిస్తున్నారు ? బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో సీఎం ఎంపికపై నిర్ణయం తీసుకుంటారు. ప్రమాణ స్వీకారం జరిగే ఐదో తేదీకి ఇంకా టైం ఉంది కదా’’ అని వ్యాఖ్యానించారు.

శ్రీకాంత్ షిండే‌కు కీలక బెర్త్‌పై..

ఏక్‌నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే‌ పేరును డిప్యూటీ సీఎం పదవి కోసం పరిశీలిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై ఏక్‌నాథ్ షిండే స్పందిస్తూ.. ‘‘ఔను దానిపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. తుది నిర్ణయాన్ని ఇప్పటివరకు తీసుకోలేదు. ఈ అంశంపై అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవిస్‌లతో త్వరలోనే నేను చర్చిస్తాను.ఆ తర్వాతే తుది నిర్ణయం వెలువడుతుంది’’ అని తెలిపారు. ‘‘నేను ఒక్కటే మాట చెప్పదల్చుకున్నాను. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో మహాయుతి కూటమిలోని మూడు పార్టీల మధ్య సమన్వయం ఉంది. మాకు ఏం దక్కిందనే దాని కంటే, మేం ప్రజలకు ఏం ఇవ్వగలం అనేదే అతి ముఖ్యం. ఎన్నికల్లో ప్రజలు మాకు భారీ మెజార్టీ కట్టబెట్టారు. వారిని అభివృద్ధి చేయాలి’’ అని ఏక్‌నాథ్ షిండే పేర్కొన్నారు.

ఆరోగ్య సమస్యల వల్లే సొంతూరికి..

సీఎం ఎంపికపై మహాయుతి కూటమి ఏర్పాటు చేసిన కీలక సమావేశాన్ని రద్దు చేసుకొని గత శుక్రవారం రోజు ఏక్‌నాథ్‌ షిండే సతారాలోని తన స్వగ్రామానికి వెళ్లారు. సీఎం పదవి దక్కనందు వల్లే అలకబూని సొంతూరికి వెళ్లిపోయారని జరుగుతున్న ప్రచారాన్ని షిండే ఖండించారు. ‘‘ఎడతెరిపి లేకుండా ఎన్నికల ప్రచారం చేయడంతో అలసిపోయాను. కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చాయి. గొంతునొప్పి, జ్వరంతో బాధపడ్డాను. అందుకే విశ్రాంతి కోసం స్వగ్రామానికి వచ్చాను. ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉంది’’ అని ఆయన తెలిపారు. సీఎం పదవిలో ఉండగా తాను ఎక్కువగా సెలవులు తీసుకోకుండా ప్రజాసేవకు అంకితమయ్యానని చెప్పారు. ఇక ఆదివారం మధ్యాహ్నమే ముంబైకి షిండే చేరుకున్నారు. తన కుమారుడికి డిప్యూటీ సీఎం పదవి, శివసేన ఎమ్మెల్యేలకు పట్టణాభివృద్ధి, హోంశాఖలను దక్కించుకునేందుకు ఆయన బీజేపీ పెద్దలతో చర్చలు జరిపే అవకాశం ఉంది.

కూటమిలో ఎన్‌సీపీ లేకపోతే.. మాకు 100 సీట్లు వచ్చేవి : శివసేన ఎమ్మెల్యే గులాబ్ రావ్

ఒకవేళ అజిత్ పవార్ ఎన్‌సీపీ మహాయుతి కూటమిలో చేరి ఉండకపోతే.. తమ పార్టీ 90 నుంచి 100 అసెంబ్లీ సీట్లను గెల్చుకొని ఉండేదని శివసేన (షిండే) ఎమ్మెల్యే గులాబ్ రావ్ పాటిల్ అన్నారు. అజిత్ పవార్ ఎన్‌సీపీని కూటమి ప్రభుత్వంలో ఎందుకు చేర్చుకుంటున్నారనే ప్రశ్నను తాము ఎన్నడూ అడగలేదన్నారు. ‘‘మా నాయకుడు ఏక్‌నాథ్ షిండేది పెద్ద మనసు. సీఎం సీటును కోల్పోయినందుకు అస్సలు బాధపడరు. ఆయనొక యోధుడు. మనసును చిన్నబుచ్చుకోడు’’ అని గులాబ్ రావ్ పేర్కొన్నారు.

సీఎం పేరు ఖరారైంది : బీజేపీ నేత రావ్‌సాహేబ్‌ దాన్వే

ముఖ్యమంత్రి పేరు ఇప్పటికే ఖరారైందని, పార్టీ కేంద్ర నాయకత్వం నిర్ధారణ కోసం ఎదురుచూస్తున్నామని బీజేపీ సీనియర్‌ నేత రావ్‌సాహేబ్‌ దాన్వే తెలిపారు. ఎవరు సీఎం అవుతారో మహారాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. మంత్రి మండలి కూర్పుపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పారు. పట్టణాభివృద్ధి శాఖ, హోంశాఖలను తమ పార్టీకి కేటాయించాలని ఏక్‌నాథ్ షిండే డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈసారి హోంశాఖ తమ వద్దే ఉండాలని బీజేపీ వాదిస్తోంది.

Tags:    

Similar News