Lucknow building collapse: బిల్డింగ్ కూలిన ఘటనలో ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో మూడంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిది చేరింది.

Update: 2024-09-08 05:38 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో మూడంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిది చేరింది. శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో షహీద్‌పాత్‌కు ఆనుకుని ఉన్న ట్రాన్స్‌పోర్ట్ నగర్‌లో బిల్డింగ్ కుప్పకూలింది. ఆ భవనంలో ఫార్మా గోదాము నిర్వహిస్తున్నారు. అందులో దాదాపు నలభై మంది పనిచేస్తున్నారు. కాగా.. ఆ బిల్డింగ్ అకస్మాత్తుగా కూలిపోయింది. ప్రమాదం జరగడానికి ముందు, భూకంపం సంభవించినట్లు లోపల పనిచేస్తున్న వ్యక్తులు భావించారు. దాదాపు 15 సెకన్ల పాటు భవనంలో ప్రకంపనలు వచ్చాయి. మొదట పిల్లర్ కూలిపోయిందని.. ఆ తర్వాత కొద్దిసేపటికే మొత్తం భవనం కుప్పకూలిందని స్థానికులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు, అగ్నిమాపక దళం, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ బృందాలు అర్థరాత్రి వరకు భవనంలో చిక్కుకున్న 28 మందిని రక్షించాయి. వీరంతా తీవ్రంగా గాయపడ్డారు. కాగా.. 8 మంది మృతదేహాలను కూడా బయటకు తీశారు. అయితే, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

అధికారులకు సీఎం ఆదేశాలు

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. గాయపడిని వారికి మెరుగైన వైద్యం అందించాలని జిల్లా అధికారులకు సూచించారు. జిల్లా పరిపాలన అధికారులు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలిలో సహాయకచర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. లక్నో ప్రమాద ఘటనపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. “లక్నోలో భవనం కూలిన ఘటన బాధాకరమైంది. లక్నో జిల్లా మేజిస్ట్రేట్‌తో ఫోన్‌లో మాట్లాడి సంఘటనా స్థలంలో పరిస్థితిని తెలుసుకున్నాను. స్థానిక పరిపాలన అక్కడ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తోంది. బాధితులకు అన్ని విధాలుగా సహాయం చేయడంలో అధికారులు నిమగ్నమై ఉన్నారు.” అని సోషల్ మీడియా ఎక్స్ లో తెలిపారు.


Similar News