దేశంలో ‘తొలి దశ’ పోలింగ్.. టాప్ పాయింట్స్ ఇవే

దిశ, నేషనల్ బ్యూరో : సార్వత్రిక ఎన్నికల సమరంలో భాగంగా 21 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాల్లో శుక్రవారం తొలి విడత పోలింగ్‌ జరిగింది.

Update: 2024-04-19 17:02 GMT

దిశ, నేషనల్ బ్యూరో : సార్వత్రిక ఎన్నికల సమరంలో భాగంగా 21 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాల్లో శుక్రవారం తొలి విడత పోలింగ్‌ జరిగింది. సాయంత్రం 7 గంటల సమయానికి దాదాపు 60.03 శాతం పోలింగ్ నమోదైందని ఈసీ వెల్లడించింది. ఫామ్-17ఏలను స్క్రూటినీ చేశాక శనివారం ఉదయం కచ్చితమైన పోలింగ్ శాతాన్ని ప్రకటిస్తామని తెలిపింది. మండే ఎండల వేడిని, వడగాలుల ధాటిని కూడా లెక్క చేయకుండా ప్రజలు పెద్దసంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు పోటెత్తడంతో ఇంత మెరుగైన పోలింగ్ నమోదైంది. శుక్రవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 6 గంటల సమయానికి పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూలైన్లలో ఉన్నవారికి కూడా ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. పలుచోట్ల స్వల్ప హింసాత్మక ఘటనలు మినహా అంతటా ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగానే జరిగింది.

రాష్ట్రాల వారీగా పోలింగ్‌ శాతాలు ఇలా..

త్రిపురలో అత్యధికంగా 79.90 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అక్కడ ఒకే ఒక్క లోక్ సభ స్థానం కోసం ఎన్నిక జరిగింది. అయినా ఇంత భారీ సంఖ్యలో పోలింగ్ నమోదు కావడం విశేషం. బీజేపీ, మమతా బెనర్జీ పార్టీ టీఎంసీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులున్న పశ్చిమబెంగాల్‌‌లో 77.57 శాతం పోలింగ్ జరిగింది. అక్కడ మూడు లోక్ సభ స్థానాలకు శుక్రవారం ఎన్నిక జరిగింది. పుదుచ్ఛేరిలో 73.25 శాతం, అసోంలో 71.38 శాతం, మేఘాలయలో 70.26 శాతం ఓటింగ్ జరిగింది. కొన్ని నెలల క్రితం వరకు హింసాకాండతో అట్టుడికిన మణిపూర్‌లో 68.62 శాతం పోలింగ్ నమోదైంది. ఒకే విడతలో అన్ని లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగిన తమిళనాడులో 62.19 శాతం పోలింగ్ రికార్డయింది. నాగాలాండ్‌‌లో ఒకే ఒక్క లోక్‌సభ స్థానం ఉంది. అక్కడి ఆరు జిల్లాల ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు. అయినా 56.77 శాతం పోలింగ్ నమోదవడం గమనార్హం. మావోయిస్టుల ఎన్‌కౌంటర్లతో అట్టుడుకుతున్న ఛత్తీస్‌గఢ్‌‌లో 63.41 శాతం ఓటింగ్ జరిగింది. అత్యంత సమస్యాత్మక జమ్మూకశ్మీర్‌‌లో 65.08 శాతం పోలింగ్ నమోదైంది. సీఎం నితీశ్ ‌కుమార్ మళ్లీ ఎన్డీయేలోకి జంప్ చేయడంతో రాజకీయం రసవత్తరంగా మారిన బిహార్‌‌లో 47.49 శాతమే ఓటింగ్ జరిగింది. అక్కడ 4 ఎంపీ స్థానాలకు శుక్రవారం ఎన్నిక నిర్వహించారు. మధ్యప్రదేశ్‌‌లో 63.33 శాతం, లక్షద్వీప్‌‌లో 59.02 శాతం, ఉత్తరప్రదేశ్‌‌లో 57.61 శాతం, అండమాన్‌ నికోబార్‌దీవుల్లో 56.87 శాతం, మహారాష్ట్ర‌లో 55.29 శాతం, ఉత్తరాఖండ్‌‌లో 53.64 శాతం, మిజోరంలో 54.18 శాతం, రాజస్థాన్‌‌లో 50.95 శాతం చొప్పున పోలింగ్ నమోదైంది.

అరుణాచల్, సిక్కిం అసెంబ్లీలకు కూడా..

తొలి విడతలోనే అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలకు అసెంబ్లీ ఎన్నికలు కూడా ముగిశాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని రెండు లోక్‌సభ స్థానాలు, 50 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు 8.92 లక్షల మంది ఓటర్లు ఓట్ల పండుగలో పాల్గొనడంతో 65.46 శాతం పోలింగ్ నమోదైంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని మారుమూల జిల్లా అన్జావ్‌లోని మాలోగామ్ పోలింగ్ కేంద్రంలో నూటికి నూరుశాతం పోలింగ్ జరిగింది. ఎందుకు అంటే.. అక్కడ ఒకే ఒక్క ఓటరు ఉన్నారు. ఈ మహిళా ఓటరు దాదాపు ఒంటిగంట ప్రాంతంలో వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 44 సంవత్సరాల ఏకైక ఓటరు సొకేలా తయాంగ్ కోసం పోలింగ్ సిబ్బంది కొండలు కనుమలు దాటి ఇక్కడికి కాలినడకన చేరుకుంది. సొకేలా తయాంగ్ కూడా కాలినడకన వచ్చి ఓటేశారు. సిక్కింలోని ఒకే ఒక్క లోక్‌సభ స్థానానికి, 32 మంది సభ్యులున్న అసెంబ్లీకి శుక్రవారమే పోలింగ్ జరిగింది. మొత్తంగా సిక్కింలో 68.06 శాతం ఓటింగ్ నమోదైంది. దాదాపు 4.64 లక్షల మంది ఓటువేశారు.

బెంగాల్, మణిపూర్, ఛత్తీస్‌గఢ్‌లలో ఉద్రిక్తత..

పశ్చిమబెంగాల్‌లోని కూచ్‌ బిహార్‌లో తృణమూల్‌, బీజేపీ వర్గాల మధ్య హింస చోటుచేసుకుంది. ఇరువర్గాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. పోలింగ్ వేళ మణిపూర్ లో కాల్పులు, ఘర్షణలు చోటుచేసుకున్నాయి.ఇక ఛత్తీస్‌గఢ్‌లో గ్రెనేడ్ దాడి జరగడంతో ఓ సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ ప్రాణాలు కోల్పోయారు. అరుణాచల్‌ప్రదేశ్‌, అసోం, అండమాన్‌ నికోబార్‌ దీవులు వంటి పలుచోట్ల ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పలుచోట్ల పోలింగ్ దాదాపు గంటపాటు ఆలస్యంగా మొదలైంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఓటుహక్కును వినియోగించుకున్నారు. దివ్యాంగులు, వృద్ధులు సైతం పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొలివిడత ఎన్నికలకు 1.87 లక్షల పోలింగ్‌ కేంద్రాల్లో దాదాపు 18 లక్షల మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు.

తొలిసారిగా ఓటు వేశారు..

ఈ ఎన్నికల్లో జీవితంలోనే తొలిసారిగా ఎంతోమంది యువత తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లా అంటే మావోయిస్టులకు ఆయువుపట్టు. ఆ జిల్లాలోని 56 ఏజెన్సీ గ్రామాలు తొలిసారిగా ఓట్ల పండుగలో భాగస్వామ్యం అయ్యాయి. గ్రేట్ నికోబార్ దీవుల్లోని షోంపెన్ గిరిజన తెగ ప్రజలు మొట్టమొదటి సారిగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓట్లు వేశారు. 2,500 మంది ఓటర్లు త్రిపురలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులోని ఫెన్సింగ్ దాటారు. చారిత్రక కారణాల వల్ల త్రిపురకు చెందిన కొందరు ఓటర్లు ముళ్ల కంచెకు అవతల బంగ్లాదేశ్ లో ఉండిపోవాల్సి వచ్చింది. వారు ఓటు వేయడానికి అనువుగా శుక్రవారం ఉదయాన్నే సరిహద్దు గేట్లను తెరిచారు.కాగా, 2019లో తొలి దశ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 91 ఎంపీ సీట్లకు పోలింగ్ జరగగా 69.68 శాతం ఓటింగ్ నమోదైంది. అప్పటితో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతంలో కొంతమేర తగ్గుదల కనిపించింది.

Tags:    

Similar News