ప్రేమికుడు సూసైడ్ చేసుకుంటే.. అమ్మాయి జవాబుదారీ కాదు :హైకోర్టు
దిశ, నేషనల్ బ్యూరో : లవ్ ఫెయిల్ అయిందని సూసైడ్ చేసుకుంటున్న ఎంతోమందిని మనం చూస్తున్నాం.
దిశ, నేషనల్ బ్యూరో : లవ్ ఫెయిల్ అయిందని సూసైడ్ చేసుకుంటున్న ఎంతోమందిని మనం చూస్తున్నాం. ఇలాంటి ఘటనలపై ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. లవ్ ఫెయిల్ అయిందనే కారణంతో ప్రేమికుడు ఆత్మహత్య చేసుకుంటే.. దానికి ప్రియురాలు బాధ్యత వహించదని హైకోర్టు స్పష్టం చేసింది. 2023లో ఒక వ్యక్తిని ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలపై ప్రాసిక్యూషన్‌ను ఎదుర్కొంటున్న ఇద్దరు వ్యక్తులు(ఒక మహిళ, ఆమె స్నేహితుడికి) ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. సూసైడ్ చేసుకున్న యువకుడి తండ్రి కోర్టులో .. ‘‘సదరు యువతి నా కొడుకుతో పాటు మరో యువకుడితో సంబంధం కలిగి ఉండేది. ఆ యువతి నా కొడుకును మోసగించి.. మరో యువకుడిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈవిషయాన్ని నా కొడుకుకు చెప్పడంతో అతడు మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకున్నాడు’’ అని వాదన వినిపించాడు. ఈమేరకు తన కొడుకు రూంలో సూసైడ్ నోట్ దొరికిందని ఆయన కోర్టుకు వివరించారు. బలహీనమైన మనస్తత్వంతో సూసైడ్ చేసుకోవాలని తీసుకున్న నిర్ణయాలకు వేరొక వ్యక్తిని బాధ్యులను చేయడం అన్యాయమని కోర్టు తేల్చి చెప్పింది. ఏప్రిల్ 16న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమిత్ మహాజన్‌తో కూడిన సింగిల్ జడ్జి ధర్మాసనం ఈమేరకు ఉత్తర్వులను జారీ చేసింది.
ప్రాణాలు తీసుకునేంత తీవ్రమైన అంశాలేవీ లేవు
‘‘లవ్ ఫెయిల్యూర్ కారణంగా ప్రేమికుడు ఆత్మహత్య చేసుకుంటే, పరీక్ష బాగా రాయలేదని విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే.. కేసులో గెలవలేదని క్లయింట్ ఆత్మహత్య చేసుకుంటే.. మహిళ, ఎగ్జామినర్, న్యాయవాదులను ఆత్మహత్యకు ప్రేరేపించిన వారిగా పరిగణించలేం’’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు. చనిపోయే ముందు సదరు యువకుడు రాసిన సూసైడ్ నోట్‌లో ఇద్దరు వ్యక్తుల పేర్లు ఉన్నప్పటికీ.. ప్రాణాలు తీసుకునేంత తీవ్రమైన అంశాలేవీ అందులో లేవని హైకోర్టు పేర్కొంది. ‘‘ఈ కేసులో సాక్ష్యంగా సమర్పించిన వాట్సాప్ చాట్‌లలో ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి. మృతుడు సున్నితమైన స్వభావం కలిగిన వాడని తేటతెల్లం అవుతోంది. సదరు యువతి మాట్లాడటానికి నిరాకరించినప్పుడల్లా ఆ యువకుడు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించేవాడు’’ అని కోర్టు తెలిపింది. ఇది శిక్షార్హమైన నేరం కాదని, నిందితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులకు కస్టడీ విచారణ అవసరం లేదని పేర్కొంటూ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. విచారణకు సహకరించాలని వారిని ఆదేశించింది.