రాహుల్ గాంధీపై దేశవ్యాప్తంగా నమోదైన కేసుల వివరాలు
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై దేశ వ్యాప్తంగా పరువు నష్టం కేసులు నమోదయ్యాయి.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై దేశ వ్యాప్తంగా పరువు నష్టం కేసులు నమోదయ్యాయి. బీజేపీ నాయకులతో పాటు ఆ పార్టీ సైద్ధాంతిక గురువు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సభ్యులు ఈ కేసులు పెట్టారు. ఒకానొక పరువు నష్టం కేసులో రాహుల్ దోషిగా తేలడంతో సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష వేసింది. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఆయనపై అనర్హత వేటు వేసింది. రాహుల్‌పై నమోదైన కేసుల వివరాలను ఓసారి పరిశీలిద్దాం....
2015: నేషనల్ హెరాల్డ్ కేసులో ప్రస్తుతం రాహుల్ బెయిల్‌పై ఉన్నారు. బీజేపీ నాయకుడు సుబ్రమణ్య స్వామి పెట్టిన ఈ కేసులో 2015 డిసెంబర్‌లో రాహుల్‌తో పాటు ఆయన తల్లి సోనియాకు కూడా బెయిల్ మంజూరైంది. నేషనల్ హెరాల్డ్ కేసులో నేషనల్ హెరాల్డ్ వార్తా పత్రికను నడుపుతున్న అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌ను యంగ్ ఇండియన్ టేకోవర్ చేసింది. అప్పటి నుంచి లావాదేవీలు కొనసాగుతున్నాయి. నేషనల్ హెరాల్డ్ ఆస్తులను యంగ్ ఇండియన్ లిమిటెడ్ కంపెనీ అక్రమంగా లాక్కుందని సుబ్రమణ్య స్వామి ఆరోపించారు. ఈ యంగ్ ఇండియా అనేది సోనియా, రాహుల్‌కు చెందిన కంపెనీ.
2016: ఆర్ఎస్ఎస్ కార్యకర్త పెట్టిన కేసులో మహారాష్ట్ర భివాండి కోర్టు రాహుల్‌కు బెయిల్ మంజూరు చేసింది. మహాత్మా గాంధీని ఆర్ఎస్ఎస్ చంపిందని రాహుల్ ఆరోపించారు.
ఈ విషయాన్ని కోర్టులో రుజువు చేయాలని సుప్రీం కోర్టు రాహుల్‌ను ఆదేశించింది.
2016: ఆర్ఎస్ఎస్ వేసిన పరువు నష్టం కేసులో గౌహతి కోర్టు రాహుల్‌కు బెయిల్ ఇచ్చింది. 2015 డిసెంబర్‌లో అస్సాంలోని బార్పేట్ సత్రంలోకి తనను వెళ్లనీయకుండా ఆర్ఎస్ఎస్ అడ్డుకుందని రాహుల్ ఆరోపించిన నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ ఈ కేసు పెట్టింది.
2019: ఆర్ఎస్ఎస్ కార్యకర్త పెట్టిన కేసులో ముంబై కోర్టు రాహుల్‌కు బెయిల్ మంజూరు చేసింది. బెంగళూరు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్యను రాహుల్ బీజేపీ-ఆర్ఎస్ఎస్ భావజాలానికి ముడిపెట్టి వ్యాఖ్యలు చేశారు. దీంతో కేసు నమోదైంది.
2019: అహ్మదాబాద్ డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ పెట్టిన పరువు నష్టం కేసులో అహ్మదాబాద్ కోర్టు రాహుల్‌కు బెయిల్ ఇచ్చింది. 2016 నవంబర్‌లో నోట్ల రద్దు తర్వాత ఈ బ్యాంకు నోట్లను ఇచ్చిపుచ్చుకునే కుంభకోణంలో పాల్గొన్నదని రాహుల్ ఆరోపించారు.
2019: మరో పరువు నష్టం కేసులో పాట్నా కోర్టు రాహుల్‌కు బెయిల్ మంజూరు చేసింది. మోడీ అనే ఇంటి పేరున్న వారంతా దొంగలే అని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత ఒకరు కేసు పెట్టారు.
2023: ఈ తాజా కేసు విషయానికొస్తే మోడీ అనే ఇంటి పేరున్న వారంతా దొంగలే అనే కేసు ప్రధాని మోడీ సొంత ఊరైన గుజరాత్‌లోని సూరత్‌లో నమోదైంది. ఈ కేసులో రాహుల్ దోషిగా తేలడంతో సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే వెంటనే బెయిల్ మంజూరు చేస్తూ 30 రోజుల్లోపు ఉన్నత న్యాయస్థానాల్లో అప్పీల్ చేసుకోవచ్చని చెప్పింది. బీజేపీ ఎమ్మెల్యే పుర్నేష్ మోడీ రాహుల్ గాంధీపై ఈ పరువు నష్టం దావా వేశారు.