Loke sabha meeting: రాహుల్ vs అనురాగ్ ఠాకూర్..కుల గణన వ్యాఖ్యలపై వాగ్వాదం
లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌పై చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్, లోక్ సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌పై చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్, లోక్ సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనురాగ్ మాట్లాడుతూ..‘కొంతమందిని కుల గణన అనే దెయ్యం వెంటాడుతోంది. కులం తెలియని వారు కూడా కుల గణన గురించి మాట్లాడుతున్నారు. ఈ సభలోనే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఓబీసీల రిజర్వేషన్‌ను వ్యతిరేకించారు’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన రాహుల్ అనురాగ్ ఠాకూర్‌పై విరుచుకుపడ్డారు. అనురాగ్ తనను అవమానించారని, దుర్భాషలాడారని ఆరోపించారు. ఆదివాసీ, దళిత, వెనుకబడిన వర్గాల సమస్యలను ఎవరు లేవనెత్తినా వారిని టార్గెట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వారి నుంచి నేన ఎటువంటి క్షమాపణ కోరుకోవడం లేదన్నారు.
కుల గణన దేశానికి ఎంతో అవసరమని దానిని ఎలాగైనా చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఈ లెక్కలు పూర్తైతే దేశం పూర్తిగా మారిపోతుందని తెలిపారు. అయితే కులం గురించి తెలియని వ్యక్తి జనాభా లెక్కల గురించి మాట్లాడతారని మాత్రమే చెప్పానని ఎవరి పేరునూ పలక లేదని అనురాగ్ క్లారిటీ ఇచ్చారు. మరోవైపు అగ్నిపథ్ పథకంపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, అనురాగ్ ఠాకూర్ మధ్య సైతం మాటల యుద్ధం జరిగింది. అగ్నిపథ్ పథకాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం మొదట్లో ప్రధాన పారిశ్రామికవేత్తల నుంచి మద్దతు పొందారని అఖిలేష్ ఆరోపించగా..దీనిపై అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు. అగ్నిపథ్ రక్షణలో100 శాతం హామీని ఇస్తుందని చెప్పారు.