Parliament Winter Session: పార్లమెంటులో అదానీ వ్యవహారం, సంభాల్ హింసపై ఆగని రగడ
అదానీ వ్యవహారం (Adani issue), ఉత్తరప్రదేశ్ సంభాల్ హింస ఘటన (Sambhal violence) తో పార్లమెంటులో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.
దిశ, నేషనల్ బ్యూరో: అదానీ వ్యవహారం (Adani issue), ఉత్తరప్రదేశ్ సంభాల్ హింస ఘటన (Sambhal violence) తో పార్లమెంటులో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.ఈ అంశం పార్లమెంట్ శీతాకాల సమావేశాలను (Winter session of Parliament) కుదిపేస్తోంది. గత మూడు రోజులుగా ఎగువ, దిగువ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. నాలుగోరోజైన శుక్రవారం కూడా ఇదే పరిస్థితి నెలకొంది. లోక్‌సభ (Lok Sabha), రాజ్యసభలు (Rajya Sabha) డిసెంబర్ 2కి ( సోమవారానికి) వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలు ప్రారంభమయ్యాయి. సమావేశాలు మొదలవ్వగానే ఎగువ సభలో ప్రతిపక్ష ఎంపీల నిరంతర నినాదాలతో సభా కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో చైర్మన్ జగదీప్ ధంఖర్ సభ్యుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. "ఇలా చేయడం సరికాదు. ఇలా వ్యవహరించి పరిస్థితులపై చెడు ప్రభావాన్ని చూపెడుతున్నాం. ఈ చర్యలు ప్రజల కోసం చేవి కావు. అసంబద్ధవిషయాల కోసం నిరసనలు చేస్తున్నాం. ప్రజలు మనల్ని చూసి ఎగతాళి చేస్తారు. వాస్తవానికి అందరం నవ్వులపాలు అయ్యాము" అని జగదీప్ ధంఖర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో సభను డిసెంబర్ 2వ తేదీ (సోమవారానికి)కి వాయిదా వేశారు. సోమవారం 11 గంటలకు తిరిగి సమావేశం కానున్నట్లు ప్రకటించారు.
లోక్ సభ వాయిదా
అటు లోక్‌సభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అదానీ వ్యవహారంపై చర్చకు విపక్షాల పట్టుతో గందరగోళం తలెత్తింది. దీంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 12 వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత తిరిగి సభాకార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అయినప్పటికీ, అదానీ వ్యవహారం, సంభాల్ హింస గురించి చర్చించాలని విపక్ష ఎంపీలు పట్టుబట్టారు. నినాదాలతో గందరగోళ పరిస్థితులు సృష్టించారు. ఎంతకీ ప్రతిపక్షాలు శాంతిచకపోవడంతో సభను డిసెంబర్ 2కి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.