అంతంత మాత్రంగానే బడ్జెట్ సెషన్.. కీలక విషయాలు వెల్లడించిన థింక్ టాంక్ నివేదిక
ఈ సారి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నిరాశాజనకంగా సాగాయి. అనుకున్నదాని కన్నా తక్కువ సమయం సాగినట్లు ఓ నివేదిక పేర్కొంది.
న్యూఢిల్లీ: ఈ సారి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నిరాశాజనకంగా సాగాయి. అనుకున్నదాని కన్నా తక్కువ సమయం సాగినట్లు ఓ నివేదిక పేర్కొంది. ప్రతిపక్షాల నిరసనల మధ్య గురువారం ఇరు సభలు వాయిదా వేస్తున్నట్లు ఉభయసభల అధ్యక్షులు ప్రకటించారు. ప్రతిపక్ష సభ్యుల ఇటీవలి ప్రవర్తన సభ గౌరవాన్ని తగ్గించడమే కాకుండా, క్రమబద్ధంగా సభ కార్యకలాపాలకు అంతరాయం కలిగించారని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. వారి ప్రవర్తన పార్లమెంటరీ వ్యవస్థను ఉల్లంఘించిందని, సభ సంక్షేమానికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు ప్రతిపక్షాలతో కేంద్రం నిరసనల మధ్య రెండో విడత బడ్జెట్ సమావేశాలు అంతంతమాత్రంగానే జరిగాయని థింక్ టాంక్ డేటా తెలిపింది. దీని ప్రకారం 133.6 గంటల నిర్ణయించిన సమయానికి లోక్ సభ 45 గంటలు జరగ్గా, రాజ్యసభ 130 గంటలకు గానూ 31 గంటలు మాత్రమే పనిచేసినట్లు ప్రజా వ్యవహారాల సర్వే నివేదిక వెల్లడించింది.
ఇరు సభలు క్వశ్చన్ అవర్ తర్వాత పదేపదే వాయిదా పడ్డాయి. పూర్తి బడ్జెట్ సెషన్లో 4.32 గంటలు లోక్‌సభలో, 1.85 గంటలు ప్రశ్నోత్తరాలు చోటుచేసుకున్నాయి. మరోవైపు సాధారణ బడ్జెట్ అంశంపై 14.45 గంటలు చర్చ జరగ్గా, 145 ఎంపీలు పాల్గొన్నారని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. రాష్ట్రపతికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై 13 గంటల 44 నిమిషాలు చర్చ జరగ్గా, 143 ఎంపీలు భాగమయ్యారు.
అంతేకాకుండా లోక్‌సభలో మొత్తం 8 ప్రభుత్వ బిల్లులు ప్రవేశపెట్టగా, ఇరుసభలు 6 బిల్లులకు ఆమోదం తెలిపాయి. అంతేకాకుండా 29 ప్రశ్నలకు మౌఖికంగా సమాధానం ఇచ్చారు. ఈ సారి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు 35 శాతం కన్నా తక్కువ ఉత్పాదకతను నమోదు చేశాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వల్ తెలిపారు. ఈ ఏడాది బడ్జెట్ సెషన్లో రాజ్యసభ 24.4 శాతం, లోక్‌సభ 34 శాతం ఉత్పాదకత సాధించిందని చెప్పారు.