ఆయువు తీస్తున్న ఆధ్యాత్మికం
ఉత్తరప్రదేశ్ లోని హథ్రాస్‌లో జరిగిన తొక్కిసలాట ఇంకా మరువలేదు..
ఉత్తరప్రదేశ్ లోని హథ్రాస్‌లో జరిగిన తొక్కిసలాట ఇంకా మరువలేదు.. ఇంకా కండ్ల ముందునే కదలాడుతోంది... 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు... ఈ పరిస్థితి నుంచి తేరుకోకముందే మరో ఘటన చోటు చేసుకుంది. బీహార్ లోని జహానాబాద్ జిల్లాలోని ముఖౌడం పూర్‌లో బాబా సిద్ధనాథ్ ఆలయం దగ్గర మళ్ళీ తొక్కిసలాట జరిగి ఏడుగురు చనిపోయారు. 20 మందికి తీవ్ర గాయాలు అవడం బాధాకరమైన విషయం.
బాబాలు, గురువులు, మత బోధకులు సభలు, సమావేశాలు పెట్టినప్పుడు పరిమితిని ఆలోచించాలి. ఎందుకంటే కొన్ని దేవాలయాలు పేరుగాంచి ఉండడం వల్ల అక్కడే సభలు, సమావేశాలు పెట్టేందుకు మత గురువులు, బాబాలు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోంది. మిగతా రోజుల్లో మిగతా ప్రాంతాలలో ఈ అవకాశం ఉంటుందో.. లేదో అనేది భక్తులకు తెలియదు కాబట్టి... ఒకసారి వినాలనే తాపత్రయంతో ఎక్కువ మంది భక్తులు ముందుకు వచ్చే పరిస్థితి ఉంటుంది. సభలు సమావేశాలు ప్రవచనాలు ఏర్పాటు చేస్తున్న రోజు.. అక్కడ పరిస్థితిని బేరీజు వేసుకోవాలి. ఎంతమంది అక్కడికి వస్తే సౌకర్యం వంతంగా జరపగలమో చూసుకోవలసిన అవసరం ప్రవచనాలు చెప్పే బాబాలు, గురువులతో పాటు ఆలయ సిబ్బంది, అధికారులకు ఎంతైనా ఉంది.
భద్రతా చర్యలు నిల్
శ్రావణమాసం ప్రత్యేక రోజు కాబట్టి అక్కడ నిర్వహించాల్సిన కార్యక్రమాలపై అధికారులు, ఆలయ సిబ్బంది లోపాలు కనబడుతున్నాయి. సిద్దనాథ్ ఆలయం దగ్గర సమావేశం పెట్టినప్పుడు మోతాదును మించి జనాలు వచ్చే పరిస్థితిని అంచనా వేయకపోవడమే ఈ ఘటనకు కారణమని అంటున్నారు. హత్రాస్ ఘటన జరిగిన తరువాత కూడా తీసుకోవాల్సిన చర్యలు సిద్ధనాథ్ ఆలయం దగ్గర సమావేశానికి ఏమాత్రం తీసుకోలేదని మేధావులు, నిపుణులు, భక్తుల బాధితులు మండిపడుతున్నారు. బాబాలు గాని, గురువులు గానీ, ప్రవచనాలు బహిరంగ సభలు ఏర్పాటు చేస్తే కచ్చితంగా ఆయా ప్రాంతంలోని పరిస్థితులు, పకృతికి సంబంధించి, అక్కడున్న ఆలయ పరిస్థితిపై అధికారులతో సమీక్షించి కట్టుదిట్టమైన చర్యలను పగడ్బందీగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత గురువులు, బాబాలకు ఎంతైనా ఉంది. స్పెషల్ రోజునే ఆ ఆలయానికి స్పెషల్ ఆదాయం వచ్చేలా దేవాలయ ప్రాంగణంలోనే పెట్టడంతో... భక్తుల రద్దీ చూడక తప్పడం లేదు.
కాసుల పైనే చూపు
సందర్శిత ప్రాంతాలు, దేవాలయాల దగ్గర ప్రసంగాలు, బహిరంగ భక్తి కార్యక్రమాలు గానీ చేపడితే... భక్తుల సౌకర్యం కోసం ఆలయ సిబ్బంది ప్రభుత్వాధికారులు, పోలీసులు సమన్వయంగా అక్కడ పరిస్థితిని సమీక్షించాలి. భక్తుల సంఖ్యను పరిమితం చేసుకోగలిగేలా చర్యలు తీసుకోవాలి. సభకు ఎంత మంది భక్తులు వస్తారని అంచనాను బట్టి ప్రోగ్రామ్స్ ఉండాలి. భక్తులను అదుపు చేసే పనిలో ఆలయ సిబ్బంది మాత్రమే కాదు, ప్రభుత్వ అధికారులు కూడా ప్రయత్నాలు చేయాలి. దైవసభలు సమావేశాలకు పర్మిషన్ ఇచ్చే విషయంలో పగడ్బందీగా వ్యవహరించాలి. పరిమిత సంఖ్య ఉండేలా చూడాలి. కానీ భక్తుల నుంచి వసూలు చేసే పైసల మీద మాత్రమే దృష్టి సాధిస్తున్నారు. ఆలయానికి ఆదాయం వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా ఎక్కువ మంది భక్తులు వస్తే ఎక్కువ ఆదాయం వస్తుందని లక్ష్యంగా పనిచేస్తున్నారు.
ప్రవచనాలు, దైవ కార్యక్రమాలు చేస్తే ఆలయ సిబ్బంది, అధికారుల పాత్ర ఎంతో కీలకం. ఇరువురిలో ఏ ఒక్కరు నిర్లక్ష్యం వహించినా ప్రమాదం జరగక తప్పదు. ఏ ఆలయం దగ్గరైనా దైవ కార్యక్రమాలు చేస్తే ... అక్కడ అనుకూలంగా లేకపోతే అధికారులు పర్మిషన్ ఇవ్వకూడదు. అక్కడ నిర్వాహకుల లోపాలపై పూర్తి బాధ్యత తీసుకోవాలి. ఘటనకు కారణమైన వారిని భాగస్వాములు చేయాలి. భక్తుల సంఖ్య మించిపోతే ప్రసార సాధనాల ద్వారా వీక్షించే సదుపాయం కల్పించాలి. జరిగిన ప్రమాదం పై ఆలస్యం చేయకుండా పూర్తి విచారణ జరిపి, లోపాలను సమీక్షించి బాధ్యులపై కఠిన శిక్షలు తీసుకోవాలి. అప్పుడే కొంతవరకు సమావేశాలో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. కొంతమేర ప్రాణ నష్టాన్ని తగ్గించగాల్గుతాం.
పట్ట హరి ప్రసాద్
87908 43009