మంత్రి బాలాజీ తొలగింపు ఉత్తర్వుల ఉపసంహరణ.. ఆయన సూచనతో వెనక్కి తీసుకున్నా : గవర్నర్‌

Update: 2023-06-30 11:01 GMT

చెన్నై: సీఎం స్టాలిన్‌ను సంప్రదించకుండానే రాష్ట్ర మంత్రి సెంథిల్‌ బాలాజీని మంత్రివర్గం నుంచి తొలగిస్తూ తమిళనాడు గవర్నర్‌ ఆర్‌.ఎన్‌. రవి జారీ చేసిన ఉత్తర్వులు వివాదానికి దారితీయడంతో ఆయన వెనక్కి తగ్గారు. కేవలం 5 గంటల్లోనే తన ఉత్తర్వులను ఉపసంహరించుకున్నారు. అటార్నీ జనరల్‌తో సంప్రదించాక తుది నిర్ణయం తీసుకునేందుకు వీలుగా ఆ ఉత్తర్వులను తాత్కాలికంగా నిలుపుదల చేశామని గవర్నర్‌ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సూచన మేరకే మంత్రి బాలాజీని తొలగించే ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నానని గవర్నర్‌ ఆర్‌.ఎన్‌. రవి స్పష్టం చేశారు. సీఎం స్టాలిన్‌కు రాసిన రెండు లేఖల్లో ఈ విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

"సాధారణ పరిస్థితులలో మంత్రి మండలి సలహా మేరకు గవర్నర్‌ వ్యవహరిస్తారనే వాస్తవం నాకు తెలుసు. అయితే మనీలాండరింగ్ వంటి అనేక అవినీతి కేసులు, తీవ్రమైన క్రిమినల్ చర్యలు ఎదుర్కొంటున్న సెంథిల్ బాలాజీని మంత్రిగా కొనసాగించాలన్న మీ (తమిళనాడు ప్రభుత్వం) పట్టుదల పక్షపాత వైఖరిని ప్రతిబింబిస్తోంది. బాలాజీ మంత్రిగా కొనసాగితే న్యాయ ప్రక్రియకు ఆటంకం కలుగడంతోపాటు న్యాయానికి విఘాతం కలుగుతుంది" అని లేఖల్లో గవర్నర్ పేర్కొన్నారు. కాగా, గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి తీసుకున్న వివాదస్పద నిర్ణయాన్ని డీఎంకే, కాంగ్రెస్‌ పార్టీలు తప్పుపట్టాయి. సీఎం స్టాలిన్‌ను సంప్రదించకుండా బాలాజీని మంత్రి పదవి నుంచి ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరించిన గవర్నర్‌ రవి తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది.


Similar News