అగ్రికల్చరల్ యూనివర్సిటీలో చిరుత.. ల్యాబ్‌లోకి ఎంట్రీ.. విద్యార్థులు షాక్ (వీడియో)

అగ్రికల్చర్ యూనివర్సిటీలో చిరుత పులి కలకలం రేపింది. తాజాగా గుజరాత్‌లోని జూనాగఢ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలోకి చిరుత ప్రవేశించింది.

Update: 2024-07-13 08:04 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: అగ్రికల్చర్ యూనివర్సిటీలో చిరుత పులి కలకలం రేపింది. తాజాగా గుజరాత్‌లోని జూనాగఢ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలోకి చిరుత ప్రవేశించింది. దీంతో క్యాంపస్‌లో భయాందోళనలు నెలకొన్నాయి. అయితే, చిరుత యూనివర్సిటీలోని ఓ ల్యాబ్‌లోకి ప్రవేశించింది. అదే సమయంలో కళాశాల విద్యార్థులు ల్యాబ్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా చిరుతను చూసి షాక్ అయ్యారు. వెంటనే ల్యాబోరేటరీ తలుపులు మూసేసి.. స్థానిక ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే లోకేషన్‌కు వచ్చిన ఫారెస్ట్ సిబ్బంది చిరుతను బందించారు. దీంతో వర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు ఊపిరి పీల్చుకున్నారు.

అయితే ఈ ఘటనపై ఫారెస్ట్ డివిజన్ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అక్షయ్ జోషి మాట్లాడుతూ.. గిర్నార్ వన్యప్రాణుల అభయారణ్యం నుంచి ఈ చిరుత వచ్చిందని, చిరుత వయసు కేవలం ఒక సంవత్సరం మాత్రమే పేర్కొన్నారు. జునాగఢ్ నగరం గిర్నార్ వన్యప్రాణుల అభయారణ్యం సరిహద్దులో ఉందన్నారు. ఇది సింహాలు, చిరుతలకు నిలయం అని పేర్కొన్నారు. దీంతో రోడ్లపై చిరుతలు, సింహాలు తరచూ విచ్చలవిడిగా తిరుగుతున్నాయని అధికారి తెలిపారు. ఈ ఘటనపై వర్సిటీ ప్రొఫెసర్ చోవాటియా మాట్లాడుతూ.. 2017లో, ఒక పెద్ద చిరుత తమ క్యాంపస్‌లో ప్రవేశించి సెక్యూరిటీ గార్డుని గాయపరిచిందని గుర్తుచేశారు. ఈసారి వచ్చిన చిరుత ఎవరిని గాయపర్చలేదని స్పష్టంచేశారు. కాగా, చిరుత ల్యాబ్‌లో ఉన్నప్పుడు తీసిన వీడియోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Tags:    

Similar News