న్యాయవాదులను వ్యాపారవేత్తలతో సమానంగా చూడలేము: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యాయవాద వృత్తి వినియోగదారుల రక్షణ చట్టం 1986 పరిధిలోకి రాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. న్యాయవాద వృత్తి ఇతర వృత్తులకు భిన్నంగా ఉంటుందని తెలిపింది. కాబట్టి వారిపై ఎలాంటి దావాలు వేయకూడదని పేర్కొంది.
దిశ, నేషనల్ బ్యూరో: న్యాయవాద వృత్తి వినియోగదారుల రక్షణ చట్టం 1986 పరిధిలోకి రాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. న్యాయవాద వృత్తి ఇతర వృత్తులకు భిన్నంగా ఉంటుందని తెలిపింది. కాబట్టి వారిపై ఎలాంటి దావాలు వేయకూడదని పేర్కొంది. ఈ మేరకు న్యాయవాదులు అందించే సేవలు వినియోగదారుల రక్షణ చట్టం పరిధిలోకి వస్తాయని 2007లో జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్(ఎన్‌సీడీఆర్‌సీ) ఇచ్చిన తీర్పును న్యాయమూర్తులు బేలా ఎం త్రివేది, పంకజ్ మిథాల్‌లతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్, బార్ ఆఫ్ ఇండియన్ లాయర్స్, ఇతరులు ఎన్‌సీడీఆర్‌సీ నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఎన్‌సీడీఆర్‌సీ తీర్పు సరికాదని తెలిపింది.
లాయర్ల విజయం వారికి నియంత్రణ లేని అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని వ్యాఖ్యానించింది. వారికి ఉన్నత స్థాయి విద్య, నైపుణ్యాలు, మానసిక శ్రమ అవసరమని అభిప్రాయపడింది. కాబట్టి న్యాయవాదులను వ్యాపారం చేసే వారితో సమానంగా చూడలేమని వెల్లడించింది. ‘నిస్సందేహంగా న్యాయవాదులు ఫీజులు తీసుకుని కేసులు వాదిస్తున్నారు. ఇది ఇద్దరి మధ్య కుదిరిన సయోధ్య.. కాబట్టి వ్యక్తిగత సేవా ఒప్పందం కాదు. అందువల్ల వారు వినియోగదారుల రక్షణ చట్టం నిబంధనల పరిధిలోకి వస్తారని భావించడానికి ఎటువంటి కారణం లేదు’ అని తెలిపింది. అలాగే వైద్యవృత్తిలో పనిచేస్తున్న వ్యక్తులు వినియోగదారుల రక్షణ చట్టం పరిధిలోకి వస్తారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వర్సెస్ వీపీ శాంత కేసులో 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందిస్తూ.. ఈ కేసును పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని తెలిపింది.