CJI : చట్టాలు మారాలి.. క్రిమినల్ కోర్టుల వ్యవస్థలో సంస్కరణలు జరగాలి : సీజేఐ
దిశ, నేషనల్ బ్యూరో : చట్టాలు మారాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (Chief Justice of India) జస్టిస్ సంజీవ్ ఖన్నా(Sanjiv Khanna) అన్నారు.
దిశ, నేషనల్ బ్యూరో : చట్టాలు మారాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (Chief Justice of India) జస్టిస్ సంజీవ్ ఖన్నా(Sanjiv Khanna) అన్నారు. ప్రత్యేకించి క్రిమినల్ కోర్టుల వ్యవస్థలో చాలా సంస్కరణలు జరగాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. కరుణ, మానవతా దృక్పథాలతో న్యాయ వ్యవస్థ ఆదర్శవంతంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. మానవహక్కుల దినోత్సవం సందర్భంగా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో సీజేఐ ప్రసంగించారు. ‘‘మనదేశంలో ఇప్పటికే చాలా చట్టాలను డీక్రిమినలైజ్ చేశాం. అయితే ఇంకా చాలా వర్క్ ప్రస్తుతం కొనసాగుతోంది’’ అని ఆయన తెలిపారు.
‘‘ఇటీవలే న్యాయవ్యవస్థ గురించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన వ్యాఖ్యలు అందరూ నిశితంగా పరిశీలించదగినవి. నల్లకోటు ధరించిన లాయర్లు, జడ్జీలను చూసి సామాన్య ప్రజలు ఆందోళనకు, భయానికి గురయ్యే పరిస్థితులు ఉండకూడదని రాష్ట్రపతి చెప్పారు’’ అని సీజేఐ (CJI) సంజీవ్ ఖన్నా గుర్తు చేశారు. సమాజంలోని అణగారిన వర్గాలకు న్యాయం చేసే దృక్కోణంతో న్యాయ వ్యవస్థ పురోగమించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ‘‘జైళ్లలో అండర్ ట్రయల్ ఖైదీలు పడుతున్న ఇబ్బందుల గురించి రాష్ట్రపతి ముర్ము ఇటీవలే ప్రత్యేకంగా ప్రస్తావించారు. మన దేశంలోని జైళ్లకు 4.36 లక్షల మంది విచారణ ఖైదీలకు వసతి కల్పించే సామర్థ్యం ఉంది. కానీ దాదాపు 5.19 లక్షల మంది అండర్ ట్రయల్ ఖైదీలను జైళ్లలో ఉంచుతున్నాం. అంటే జైళ్లలో పరిమితికి మించి ఏకంగా 119 శాతం మంది విచారణ ఖైదీలు ఉంటున్నారు. ఈవిధంగా కిక్కిరిసిన జైళ్లలో ఉండాల్సి రావడం అనేది కొందరు విచారణ ఖైదీలను నేరపూరిత విష వలయంలోకి నెడుతోంది’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు.
‘‘నా వ్యక్తిగత అనుభవం విషయానికి వస్తే.. ఢిల్లీలో అత్యంత క్లిష్టతరమైన న్యాయస్థానం అంటే ట్రాఫిక్ ఛలాన్ కోర్టు. ట్రాఫిక్ ఫైన్లు ఢిల్లీలో చాలా ఎక్కువ. స్వయం ఉపాధిని పొందే వ్యక్తులు వాహనాలను ఈఎంఐపై కొనుగోలు చేస్తుంటారు. అలాంటి వాళ్ల వెహికల్స్‌పై భారీఫైన్లు వేస్తే దారుణంగా ఇబ్బందిపడతారు. వాళ్లు ఫైన్ కట్టాక.. వెహికల్ ఈఎంఐ కట్టడం, ఇంటి ఖర్చులు వెళ్లదీయడం కష్టతరంగా మారుతుంది’’ అని సీజేఐ సంజీవ్ ఖన్నా చెప్పుకొచ్చారు.