‘చంద్రయాన్-3’కి ముహూర్తం ఫిక్స్..

‘భారత అంతరిక్ష పరిశోధన సంస్థ’(ఇస్రో) మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది.

Update: 2023-06-28 16:17 GMT

శ్రీహరికోట: ‘భారత అంతరిక్ష పరిశోధన సంస్థ’(ఇస్రో) మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. చందమామ ఉపరితలంపై సురక్షిత, సాఫ్ట్ ల్యాండింగ్‌తోపాటు అక్కడ ఇతర శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించడమే లక్ష్యంగా రూపొందించిన చంద్రయాన్-3 ప్రయోగానికి ముహూర్తం ఖరారైంది. జూలై 13న మధ్యాహ్నం 2:30 గంటలకు రాకెట్‌ను ప్రయోగించనున్నట్టు ఇస్రో బుధవారం వెల్లడించింది. రూ.613 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ ప్రయోగాన్ని శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్‌ నుంచి నిర్వహించనున్నారు. ఇందుకోసం జీఎస్ఎల్వీ మార్క్ 3 హెవీ-లిఫ్ట్ లాంచ్ వెహికిల్‌ను ఉపయోగించనున్నారు. చంద్రయాన్-2కు కొనసాగింపుగా చేపడుతున్న ఈ మిషన్‌పై శాస్త్రవేత్తలు పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఇందుకు సంబంధించిన పనులు ఇప్పటికే దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది.

కాగా, 2008లో చంద్రయాన్-1ను ప్రయోగించగా అది విజయవంతంగా చంద్రుడి ఉపరితలంపై నీటి జాడలను గుర్తించిన విషయం తెలిసిందే. చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని ఆవిష్కరించడమే లక్ష్యంగా 2019లో చేపట్టిన చంద్రయాన్‌-2 ప్రయోగం సాఫ్ట్ ల్యాండింగ్‌లో విఫలమైంది. జాబిల్లి ఉపరితలాన్ని బలంగా ఢీకొట్టి దెబ్బతింది. ఈ క్రమంలోనే చేపడుతున్న చంద్రయాన్ 3 ప్రయోగం ఆసక్తికరంగా మారింది. చంద్రయాన్-2 విఫలానికి గల కారణాలను పూర్తిస్థాయిలో విశ్లేషించి, వాటిని అధిగమించేలా చంద్రయాన్-3 మిషన్‌ను రూపొందించామని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. మరోవైపు, సూర్యుడిపై అధ్యయనం జరిపేందుకు ఉద్దేశించిన ఆదిత్య-ఎల్1 మిషన్‌‌ను ఆగస్టు 10న ప్రయోగించే అవకాశమున్నట్టు ఇస్రో చీఫ్ ఎస్. సోమనాథ్ తెలిపారు.


Similar News