Lateral entry: లేటరల్ ఎంట్రీ నియామకాలు రద్దు.. యూపీఎస్సీకి కేంద్రం లేఖ

లేటరల్ ఎంట్రీ నియామకాలపై కేంద్రం వెనక్కి తగ్గింది. ఈ విధానం ద్వారా నియామకం చేపట్టేందుకు ఇటీవల రిలీజ్ చేసిన నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవాలని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) చైర్మన్ ప్రీతి సూదన్‌కు మంగళవారం లేఖ రాశారు.

Update: 2024-08-20 12:55 GMT

దిశ, నేషనల్ బ్యూరో: లేటరల్ ఎంట్రీ నియామకాలపై కేంద్రం వెనక్కి తగ్గింది. ఈ విధానం ద్వారా నియామకం చేపట్టేందుకు ఇటీవల రిలీజ్ చేసిన నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవాలని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) చైర్మన్ ప్రీతి సూదన్‌కు మంగళవారం లేఖ రాశారు. ‘లేటరల్ ఎంట్రీ విధానం రాజ్యాంగంలో పొందుపర్చిన సమానత్వం, సామాజిక న్యాయం సూత్రాలకు అనుగుణంగా ఉండాలి. కాబట్టి ఈ అంశంపై సమీక్షించాల్సిన అవసరం ఉందని మోడీ చెప్పారు. దీంతో ఇటీవల విడుదల చేసిన లేటరల్ ఎంట్రీ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నాం’ అని లేఖలో పేర్కొన్నారు. ఈ నియామకాల్లో రిజర్వేషన్ కోసం ఎటువంటి నిబంధన లేదని స్పష్టం చేశారు. సామాజిక న్యాయాన్ని నిర్ధారించడంపై మోడీ దృష్టి సారించిన నేపథ్యంలో ఈ అంశాన్ని సంస్కరించాలని అభిప్రాయపడ్డారు.

2005లో వీరప్ప మొయిలీ అధ్యక్షతన ఏర్పాటైన రెండో పరిపాలనా సంస్కరణల కమిషన్‌ ద్వారా పార్శ్వ ప్రవేశానికి ఆమోదం లభించిందని గుర్తు చేశారు. 2013లో ఆరో వేతన సంఘం కూడా దీనికి మద్దతిచ్చిందని తెలిపారు. ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడానికి మాత్రమే తమ ప్రభుత్వం కృషి చేశామని పేర్కొన్నారు. కాగా, వివిధ మంత్రిత్వ శాఖల్లో 45 మంది జాయింట్ సెక్రటరీలు, డైరెక్టర్లు, డిప్యూటీ సెక్రటరీలను లేటరల్ ఎంట్రీ పద్దతి ద్వారా రిక్రూట్ చేయడానికి ఈ నెల 17న యూపీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అంటే ఎటువంటి పరీక్ష లేకుండా నేరుగా కాంట్రాక్ట్ బేసిక్‌పై వీరంతా ఉన్నత పదవుల్లో నియామకమవుతారు. దీంతో ఈ విధానంసై దేశ వ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. ప్రతిపక్షాలు కేంద్రంపై విరుకుకు పడ్డాయి. ఎన్డీయే మిత్రపక్షమైన ఎల్‌జేపీ(రామ్‌విలాస్) పార్టీ సైతం అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం యూటర్న్ తీసుకుంది.

రిజర్వేషన్‌ను లాక్కోవాలనే ప్రణాళిక విఫలం: మల్లికార్జున్ ఖర్గే

లేటరల్ ఎంట్రీ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటం రిజర్వేషన్‌ను లాక్కోవాలనే బీజేపీ ప్రణాళికలను నాశనం చేసిందని తెలిపారు. తమ ఆందోళనతోనే ప్రభుత్వం వెనక్కి తగ్గిందని చెప్పారు. దళితులు, గిరిజనులు, వెనుకబడిన, బలహీన వర్గాలకు సామాజిక న్యాయం దక్కే వరకు కాంగ్రెస్ పోరాడుతుందని వెల్లడించారు. లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ..రాజ్యాంగాన్ని, రిజర్వేషన్‌ వ్యవస్థను కూడా అన్నివిధాలా పరిరక్షిస్తామని ఎక్స్‌లో పేర్కొన్నారు.

ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తు్న్నాం: చిరాగ్ పాశ్వాన్

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఎల్ జేపీ(రామ్ విలాస్) చీఫ్, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ స్వాగతించారు. ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన ప్రజల ఆందోళనలను ప్రధాని మోడీకి నిరంతరం వివరించినట్టు తెలిపారు. గత రెండు రోజులుగా పీఎంఓ కార్యాలయంతో సంప్రదింపులు జరిపానని చెప్పారు. ప్రజల ఆందోళనలను అర్థం చేసుకుని ఈ విధానాన్ని రద్దు చేసిన మోడీకి కృతజ్ఞతలు తెలిపారు.

Tags:    

Similar News