బద్రీనాథ్ హైవేపై కొండచరియలు.. 48 గంటల పాటు భక్తుల ఇబ్బందులు..

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లపై కొండచరియలు విరిగి పడుతున్నాయి.

Update: 2024-07-11 07:21 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లపై కొండచరియలు విరిగి పడుతున్నాయి. తాజాగా బద్రీనాథ్ యాత్రాస్థలాన్ని కలిపే జాతీయ రహదారి చమోలిలో రెండు పెద్ద కొండచరియలు విరిగిపడటంతో ఈ మార్గాన్ని దాదాపు 48 గంటల పాటు మూసివేశారు. దీంతో ఇరువైపుల ఉన్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బద్రీనాథ్‌ను దర్శించుకోడానికి వెళ్తున్న వారు, దర్శనం తరువాత తిరుగు ప్రయాణం ప్రారంభించిన వారు వేలాది మంది అక్కడ చిక్కుకున్నారు.

బుధవారం పాతాళగంగ వద్ద కొండచరియలు విరిగిపడటంతో బద్రీనాథ్‌కు వెళ్ళే రహదారి సొరంగ ముఖద్వారం వద్ద శిథిలాలు కుప్పలుగా పేరుకుపోయాయి. వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని జేసీబీల ద్వారా శిథిలాలను క్లియర్ చేసే పనులు ప్రారంభించారు. గురువారం ఉదయం నాటికి హైవేలో కొంత భాగాన్ని క్లియర్ చేయగా, జోషిమత్ సమీపంలో భానెర్పానీలో రోడ్డుపై ఇంకా కొన్ని శిథిలాలు అలాగే ఉన్నాయి. వాటిని కూడా తొలగిస్తున్నారు.

అయితే భక్తులు కొంతమంది కాలినడకన ఆ ప్రాంతాన్ని దాటగలుగుతున్నారు. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం సిబ్బంది పాక్షికంగా కొట్టుకుపోయిన రోడ్డును దాటడానికి ప్రయాణికులకు సహాయం చేస్తున్నారు. కొండచరియలు విరిగిపడటంతో బద్రీనాథ్, జోషిమత్, నీతి, మన, తపోవన్, మలారి, లత, రాయిని, పాండుకేశ్వర్, హేమకుండ్ సాహిబ్‌లతో కనెక్టివిటీ తెగిపోయింది. 2,000 మంది ప్రయాణికులు, యాత్రికులు బద్రీనాథ్- హేమకుండ్ సాహిబ్ హైవేపై చిక్కుకుపోయారు.


Similar News