Patna: కుల గణన చేసేలా RSS, BJPలపై ఒత్తిడి తెస్తాం: లాలూ ప్రసాద్

కుల గణనను నిర్వహించేలా అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ(BJP), దాని సైద్ధాంతిక సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS)‌పై ఒత్తిడి తీసుకొస్తామని రాష్ట్రీయ జనతా దళ్(RJD) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Update: 2024-09-03 14:58 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కుల గణనను నిర్వహించేలా అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ(BJP), దాని సైద్ధాంతిక సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS)‌పై ఒత్తిడి తీసుకొస్తామని రాష్ట్రీయ జనతా దళ్(RJD) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సోషల్ మీడియా ఎక్స్‌లో వ్యాఖ్యానించిన ఆయన.. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలపై కుల గణనను పూర్తి చేసేలా తీవ్ర ఒత్తిడి తీసుకొస్తాం. కుల గణన చేయించకుండా చూసే అధికారం వీళ్ళకేం ఉంది. దళితులు, వెనుకబడిన వారు, గిరిజనులు, పేదలు ఐక్యతను ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైందని లాలూ ప్రసాద్ అన్నారు.

ఇటీవల ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు సునీల్ అంబేకర్ నిర్దిష్ట కమ్యూనిటీలు లేదా కులాల సమాచారాన్ని సేకరించడానికి సంస్థకు ఎటువంటి అభ్యంతరం లేదని, అయితే సేకరించిన సమాచారం వారి సంక్షేమం కోసం ఖచ్చితంగా ఉపయోగించాలని, రాజకీయ సాధనంగా కాకుడదని సూచించారు. ఈ నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చిన ఒక రోజు తరువాత లాలూ ప్రసాద్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

మరోవైపు పాట్నాలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ మాట్లాడుతూ, కేంద్రంలో, రాష్ట్రంలోని NDA ప్రభుత్వం 'సమాజంలోని అణగారిన వర్గాలకు రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా', కుల జనాభా గణనకు వ్యతిరేకంగా ఉందని ఆరోపించారు. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 1 ఆదివారం నాడు కుల గణన చేపట్టాలని కోరుతూ ఆర్జేడీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టింది.


Similar News