లాలూను 10 గంటలు ప్రశ్నించిన ఈడీ
దిశ, నేషనల్ బ్యూరో : ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కాం కేసులో రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాదాపు 10 గంటలపాటు ప్రశ్నించింది.
దిశ, నేషనల్ బ్యూరో : ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కాం కేసులో రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాదాపు 10 గంటలపాటు ప్రశ్నించింది. పాట్నాలోని ఈడీ కార్యాలయంలో ఈ సుదీర్ఘ విచారణ జరిగింది. సోమవారం ఉదయం 11.05 గంటలకు ఈడీ కార్యాలయంలోకి ప్రవేశించిన లాలూ, ఆయన కుమార్తె మీసా భారతి.. తిరిగి రాత్రి 9 గంటలకు బయటికి వచ్చారు. వీరిద్దరు కూడా ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కాం కేసులో నిందితులుగా ఉన్నారు. జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ మహా కూటమికి గుడ్‌బై చెప్పిన మరుసటి రోజే ఆర్జేడీ చీఫ్‌ను ఈడీ పిలిపించి ఇంత సుదీర్ఘంగా విచారించడం గమనార్హం. 2004 నుంచి 2009 మధ్యకాలంలో లాలూ కేంద్ర రైల్వేమంత్రిగా వ్యవహరించారు. ఆ టైంలో బిహార్‌కు చెందిన యువతకు రైల్వేలో జాబ్స్ ఇప్పించినందుకు లాలూ కుటుంబీకులు, సన్నిహితులు ముడుపులుగా భూములను పుచ్చుకున్నారనే అభియోగాలతో కేసు నమోదైంది. దీనిపై తొలుత సీబీఐ దర్యాప్తు చేసి.. మనీలాండరింగ్ వ్యవహారాలు ఉండటంతో కేసును ఈడీకి బదిలీ చేశారు. ఈ కేసులో ఈ నెల ప్రారంభంలో ఈడీ తన మొదటి ఛార్జ్ షీట్‌ను దాఖలు చేసింది. ఇందులో లాలూ ప్రసాద్ యాదవ్ భార్య, బిహార్ మాజీ సీఎం రబ్రీదేవి, లాలూ కుమార్తె మీసా భారతిని నిందితులుగా ప్రస్తావించారు. లాలూ ప్రసాద్ మరో కుమార్తె హేమా యాదవ్ పేరు కూడా ఛార్జ్ షీట్‌లో ఉంది. ఈ దర్యాప్తులో భాగంగా గతేడాది రబ్రీ దేవి, మీసా భారతిలకు అనుబంధమున్న కంపెనీలకు చెందిన రూ.6 కోట్లకుపైగా విలువచేసే ఆస్తులను ఈడీ జప్తు చేసింది.