Kolkata : ఆస్పత్రుల్లో భద్రతా చర్యల అమలు.. రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ లేఖ

దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ దురాగతం నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కీలక మార్గదర్శకాలను జారీ చేసింది.

Update: 2024-09-04 13:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ దురాగతం నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. ఆస్పత్రుల్లో వైద్యులు, ఆరోగ్య కార్యకర్తల భద్రతకు సంబంధించిన నిబంధనలను ఎంతమేరకు అమలు చేస్తున్నారనే వివరాలతో సెప్టెంబరు 10లోగా నివేదికను సమర్పించాలని ఆదేశించింది. ఈమేరకు రాష్ట్రాలు, యూటీల చీఫ్ సెక్రెటరీలు, డీజీపీలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర బుధవారం లేఖ రాశారు. ఆగస్టు 28న ఇదే అంశంపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్నందుకు వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

‘‘రోగుల తాకిడి ఎక్కువగా ఉండే హాస్పిటళ్లను హైప్రయారిటీ ఎస్టాబ్లిష్‌మెంట్లుగా గుర్తించాలి. వాటిలో రెగ్యులర్‌గా సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించాలి. సీసీటీవీ నిఘా ఏర్పాట్లు చేయాలి. ఆయా ఆస్పత్రుల్లో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసేందుకు స్థానిక వైద్యాధికారులు, పోలీసులతో కలిసి పనిచేయాలి’’ అని రాష్ట్రాలు, యూటీలను కేంద్ర ఆరోగ్యశాఖ కోరింది. ‘‘ఆస్పత్రుల్లోని ఎమర్జెన్సీ రూమ్‌లు, ఐసీయూలు, లేబర్ రూంల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి’’ అని సూచించింది. ప్రతికూల పరిస్థితులను సమయస్ఫూర్తితో ఎదుర్కొనేలా వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలకు తగిన శిక్షణ అందించాలని కేంద్ర సర్కారు కోరింది.


Similar News