CBI : ఐదుగురు డాక్టర్లకు సీబీఐ సమన్లు.. జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం కేసులో కీలక పరిణామం

దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనకు సంబంధించి సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేసింది.

Update: 2024-08-15 17:19 GMT

దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనకు సంబంధించి సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. గురువారం రోజు ఉదయం జూనియర్ వైద్యురాలి ఇంటికి సీబీఐ టీమ్ వెళ్లింది. ఈ కేసుకు సంబంధించి మృతురాలి తల్లిదండ్రులు అందించిన వివరాలను, అనుమానితుల సమాచారాన్ని సీబీఐ అధికారులు రికార్డు చేశారు. అనంతరం సాయంత్రం ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం జరిగిన సెమినార్ హాల్‌లోని క్రైమ్ సీన్‌ను సీబీఐ టీమ్ నిశితంగా పరిశీలించి క్లూస్‌ను సేకరించింది. ఆగస్టు 8న రాత్రి ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలిపై అఘాయిత్యం జరిగింది. ఆ రోజు రాత్రి విధులు నిర్వర్తించిన ఇంటర్న్ డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని సీబీఐ ఈసందర్భంగా ప్రశ్నించి స్టేట్‌మెంట్లను రికార్డు చేసింది. మొత్తం ఐదుగురు డాక్టర్లను సీబీఐ స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ ప్రశ్నించి, వారికి సమన్లు జారీ చేసింది. విచారణ కోసం అందుబాటులో ఉండాలని నిర్దేశించింది. సమన్లు పొందిన ఐదుగురు వైద్యుల జాబితాలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ మాజీ మెడికల్ సూపరింటెండెంట్ (వైస్ ప్రిన్సిపల్) సంజయ్ వశిష్ట్, చెస్ట్ విభాగాధిపతి (ప్రిన్సిపల్) అరుణవ దత్త చౌదరి ఉన్నారు. జూనియర్ వైద్యురాలి డెడ్‌బాడీకి పోస్టుమార్టం నిర్వహించిన ముగ్గురు ఫోరెన్సిక్ డాక్టర్లు రీనా దాస్, మోలీ బెనర్జీ, అపూర్వ బిశ్వాస్‌లను కూడా సీబీఐ ఇంటరాగేట్ చేసింది. ఈ ఐదుగురు డాక్టర్లను సీబీఐ గురువారం దాదాపు నాలుగు గంటలపాటు ప్రశ్నించింది.

సంజయ్ రాయ్‌ కాల్ రికార్డులపై ఫోకస్

ఈ కేసులో అరెస్టయిన నిందితుడు, ఆస్పత్రి సివిక్ వాలంటీర్ సంజయ్ రాయ్‌కు సంబంధించిన కాల్ డీటైల్ రికార్డ్, మొబైల్ టవర్ లొకేషన్‌ల సమాచారాన్ని సేకరించే పనిలో సీబీఐ అధికారులు ఉన్నారు. ఇక కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఉన్న ఏరియాకు సంబంధించిన తాలా పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఇన్‌ఛార్జి‌ అభిజిత్ మోండల్‌ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో స్థానిక పోలీసుల పాత్ర ఎంతమేర ఉందనే దానిపైనా సమాచారాన్ని సీబీఐ టీమ్ సేకరిస్తోంది.

12 మంది అరెస్ట్

ఇక గురువారం తెల్లవారుజామున ఆర్జీ కర్ మెడికల్ కాలేజీపై జరిగిన దాడి ఘటనలో 12 మందిని అరెస్టు చేశారు. ఆస్పత్రిలో దాడికి పాల్పడుతున్న అల్లరిమూకల ఫొటోలను పోలీసులు ఫేస్‌బుక్ వేదికగా విడుదల చేశారు. వాటిలోని అల్లరిమూకలను ఎవరైనా గుర్తుపడితే తమకు సమాచారం అందించాలని కోరారు.

Tags:    

Similar News