Kolkata Rape Murder Case: చాలానే ఆధారాలు దొరికాయి.. సీబీఐ అధికారి కీలక వ్యాఖ్యలు

దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతా‌లోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సివిక్ వాలంటీర్ సంజయ్‌రాయ్‌కు సీబీఐ అధికారులు లై డిటెక్టర్ (పాలీగ్రాఫ్) పరీక్ష నిర్వహించారు.

Update: 2024-08-25 15:57 GMT

దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతా‌లోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సివిక్ వాలంటీర్ సంజయ్‌రాయ్‌కు సీబీఐ అధికారులు లై డిటెక్టర్ (పాలీగ్రాఫ్) పరీక్ష నిర్వహించారు. అతడు ప్రస్తుతం కోల్‌కతా జైలులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నాడు. దీంతో అక్కడే సంజయ్ రాయ్‌కు లై డిటెక్టర్‌ పరీక్షను నిర్వహించామని సీబీఐ అధికారులు వెల్లడించారు. ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులతో కూడిన సీబీఐ టీమ్ ఆధ్వర్యంలో అతడికి ఈ పరీక్షను నిర్వహించారు. సంజయ్ రాయ్‌కు ఈ టెస్టును నిర్వహించేందుకు ఆదివారం ఉదయం 11.30 గంటలకు జైలులోకి వెళ్లిన సీబీఐ అధికారుల టీమ్.. మధ్యాహ్నం 3.30 గంటలకు బయటికి వచ్చింది. దీన్నిబట్టి అతడిని సుదీర్ఘంగా ప్రశ్నించినట్లు స్పష్టమవుతోంది. ఇదే కేసుకు సంబంధించి మరో ఇద్దరు నిందితులకు సీబీఐ కార్యాలయంలో లై డిటెక్టర్ పరీక్ష జరిగింది. ఈ పరీక్షలను నిర్వహించే క్రమంలో నిందితులను ఏమేం ప్రశ్నలు అడిగారు ? వారు ఏమేం సమాధానాలు చెప్పారు ? అనే సమాచారాన్ని సీబీఐ వర్గాలు గోప్యంగా ఉంచాయి. ఢిల్లీ నుంచి వచ్చిన సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీ (సీఎఫ్‌ఎస్‌ఎల్) నిపుణుల బృందం ఈ పరీక్షలు నిర్వహించింది.

ఈ కేసులో ఇప్పటివరకు..

లై డిటెక్టర్ పరీక్షకు ముందు తాను నిర్దోషినని జైలు అధికారులతో సంజయ్ రాయ్ చెప్పినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. వైద్యురాలి హత్యాచారం గురించి తనకు తెలియదని, ఈ కేసులో తనను ఇరికించారని అతడు పేర్కొన్నట్లు ఆ కథనాల్లో ప్రస్తావించారు. ‘‘ఈ కేసులో ఇప్పటివరకు ఏమైనా సాక్ష్యాలు దొరికాయా ?’’ అని సీబీఐ అధికారులను మీడియా ప్రతినిధులు ఆదివారం ప్రశ్నించగా.. ‘‘చాలానే ఆధారాలు దొరికాయి’’ అని బదులిచ్చి ఓ అధికారి వెళ్లిపోయారు. ఇక మెడికల్‌ కాలేజీ మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ఘోష్‌, హత్యాచార ఘటన జరిగిన రోజు (ఆగస్టు 9న తెల్లవారుజామున) జూనియర్ వైద్యురాలితో కలిసి డ్యూటీ చేసిన నలుగురు వైద్యులు, సంజయ్ రాయ్ సహోద్యోగి (సివిల్‌ వాలంటీర్‌) సౌరవ్ భట్టాచార్యలకు శనివారమే లై డిటెక్టర్‌ పరీక్షలు పూర్తయ్యాయి. 


Similar News