Kolkata Murder Case : ప్రజల ఓపికను పరీక్షించొద్దు.. బెంగాల్ సీఎం మమతకు గవర్నర్ వార్నింగ్

దిశ, నేషనల్ బ్యూరో : ప్రజల ఓపికను పరీక్షించొద్దంటూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనందబోస్ వార్నింగ్ ఇచ్చారు.

Update: 2024-09-05 18:31 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ప్రజల ఓపికను పరీక్షించొద్దంటూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనందబోస్ వార్నింగ్ ఇచ్చారు. బెంగాల్‌లో చట్టాలను సరిగ్గా అమలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. రాష్ట్ర పోలీసుల్లో కొందరు నేర స్వభావంతో ప్రవర్తిస్తుండగా, ఇంకొందరు రాజకీయ ప్రలోభాలకు లొంగిపోతున్నారని ధ్వజమెత్తారు. కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన దురాగతంపై స్పందిస్తూ.. గవర్నర్ సీవీ ఆనందబోస్ ఈ కామెంట్స్ చేశారు.

‘‘జూనియర్ వైద్యురాలి కేసులో తప్పు చేసిన వారికి శిక్షపడాల్సిందే. బెంగాల్ ప్రభుత్వం వల్ల న్యాయం జరుగుతుందని అందరూ ఆశించారు. కానీ అలా జరగలేదు. చట్టాలను సరిగ్గా అమలు చేయలేదు’’ అని గవర్నర్ ఆరోపించారు. ‘‘హత్యాచార ఘటనలో చనిపోయిన జూనియర్ వైద్యురాలి తల్లిదండ్రులను నేను కలిశాను. వారి బాధను చెవులారా విన్నాను. నాకు చాలా బాధ కలిగింది. అందుకే బాధిత కుటుంబం తరఫున కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిశాను. వారి పరిస్థితిని ఆయనకు వివరించాను. బాధిత కుటుంబం న్యాయాన్ని మాత్రమే కోరుకుంటోంది. తప్పకుండా వారికి న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాను’’ గవర్నర్ సీవీ ఆనందబోస్ పేర్కొన్నారు. ‘‘ప్రజల వాణినే దేవుడి వాణిగా భావించాలి. లేదంటే అదే ప్రజలు బుద్ధి చెబుతారు’’ అని ఆయన తెలిపారు.


Similar News