Kiren Rijiju: ఇవి ‘బాల్ బుద్ధి’ మాటలే.. రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు కౌంటర్
మిస్ ఇండియా పోటీల గురించి రాహుల్ చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు కౌంటర్ ఇచ్చారు. ఇవి బాల్ బుద్ధి(పిల్లల మనస్తత్వం) వ్యాఖ్యలే అని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు.
దిశ, నేషనల్ బ్యూరో: మిస్ ఇండియా పోటీల గురించి రాహుల్ చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు కౌంటర్ ఇచ్చారు. ఇవి బాల్ బుద్ధి(పిల్లల మనస్తత్వం) వ్యాఖ్యలే అని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. ‘ఇప్పుడు రాహుల్ గాంధీ మిస్ ఇండియా పోటీలు, సినిమాలు, ఆటల్లో రిజర్వేషన్లు కావాలని కోరుకుంటున్నారు. ఇది ‘బాల్ బుద్ధి’ సమస్య మాత్రమే కాదు. ఆయన్ని ఉత్సాహపరిచేవారు కూడా ఈ వ్యాఖ్యలకు బాధ్యులే. చిన్నపిల్లల తెలివితేటలు వినోదానికి మంచివి కావచ్చు. కానీ మీ విభజన వ్యూహాలతో అణగారిన వర్గాలను ఎగతాళి చేయకండి.’ అని రిజిజు చెప్పుకొచ్చారు.
వారిని ప్రభుత్వం ఎంపిక చేయదు- రిజిజు
కేంద్ర ప్రభుత్వం మిస్ ఇండియాను, ఒలింపిక్స్‌కు క్రీడాకారులను, నటులను ఎంపిక చేయవని రాహుల్ పై రిజిజు మండిపడ్డారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి అత్యున్నత సర్వీసుల రిక్రూట్‌మెంట్లలో రిజర్వేషన్లను మార్చేందుకు సుప్రీంకోర్టు అనుమతించబోదన్నారు. రాష్ట్రపతి పదవిలో ఉన్నది ఓ గిరిజన మహిళ, ప్రధాని ఓబీసీ, రికార్డు సంఖ్యలో ఎస్సీ/ఎస్టీ వర్గాలకు చెందినవారు కేబినెట్‌లో మంత్రులుగా ఉన్నారని గుర్తుచేశారు. వారంతా రాహుల్ గాంధీకి కనిపించటం లేదు అని కిరణ్ రిజిజు ఎద్దేవా చేశారు.
రాహుల్ ఏమన్నారంటే?
శనివారం రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ లో మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ నేను మిస్ ఇండియా పోటీల్లో పాల్లొనే వారి జాబితాను పరిశీలించాను. అందులో ఒక్క దళిత, ఆదివాసీ, ఓబీసీ మహిళ లేదు. కొంతమంది క్రికెట్, బాలీవుడ్ గురించి మాట్లాడారు. అందులో కూడా దళిత, ఆదివాసీలు లేరు. మీడియా రంగలోని టాప్ యాంకర్లలో 90 శాతం మంది అణగారిన వర్గాలకు చెందిన వారు కాదు’’ అని అన్నారు. దీనిపైనే రిజిజు కౌంటర్ ఇచ్చారు.