మణిపూర్‌లో కిడ్నాప్‌కు గురైన పోలీస్ ఆఫీసర్ సేఫ్: రక్షించిన భద్రతా బలగాలు

మణిపూర్‌లో కిడ్నాప్ గురైన ఇంఫాల్ వెస్ట్ అదనపు ఎస్పీ మొయిరంగ్థెమ్‌ను భద్రతా బలగాలు రక్షించాయి. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశాయి.

Update: 2024-02-28 05:32 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్‌లో కిడ్నాప్ గురైన ఇంఫాల్ వెస్ట్ అదనపు ఎస్పీ మొయిరంగ్థెమ్‌ అమిత్ సింగ్‌ను భద్రతా బలగాలు రక్షించాయి. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశాయి. ఎస్పీ కిడ్నైపైన విషయం తెలిసిన వెంటనే రంగంలోని దిగిన బలగాలు, రాష్ట్ర పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. కొన్ని గంటల వ్యవధిలోనే అపహరణకు గురైన అదనపు ఎస్పీ, ఆయన ఎస్కార్ట్‌ను క్వాకీథెల్ కొంజెంగ్ లీకై ప్రాంతంలో గుర్తించి సేవ్ చేశారు. అనంతరం వారిని వైద్య చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని అధికారులు తెలిపారు. కాగా, మంగళవారం సాయంత్రం సుమారు 200 మంది మిలిటెంట్లు మొయిరంగ్థెమ్‌ ఇంటిపై దాడి చేసి ఆయనను ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భద్రతా బలగాలు, సాయుధ వ్యక్తుల మధ్య కాల్పులు సైతం చోటు చేసుకున్నాయి.

మరోసారి ఉద్రిక్త పరిస్థితులు

ఇప్పటికే అల్లర్లతో అట్టుడుకున్న మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అదనపు భద్రతా బలగాలను ప్రభుత్వం రంగంలోకి దింపింది. అస్సాం రైఫిల్స్‌కు చెందిన 4 బెటాలియన్లను ఇంఫాల్ వెస్ట్ ప్రాంతంలో మోహరించారు. ఇటీవల మొయిరంగ్థెమ్‌ వాహనాల ధ్వంసం ఆరోపణలపై మెయితీ వర్గానికి చెందిన ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలోనే వారి విడుదల చేసం నిరసనలు వెల్లువెత్తడంతో ఘర్షణలు మొదలయ్యాయి. అయితే ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని సీఎం బిరేన్ సింగ్ తెలిపారు. 

Tags:    

Similar News