Kharge: వారి వల్లే దేశం రెండు ముక్కలు.. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే సంచలన వ్యాఖ్యలు

ఈ రోజు వారు "విభజన భయానక దినోత్సవం" జరుపుకుంటారని, వారి విద్వేషపూరిత రాజకీయాల వల్లే దేశం రెండు ముక్కలు అయ్యిందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.

Update: 2024-08-15 08:21 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ రోజు వారు "విభజన భయానక దినోత్సవం" జరుపుకుంటారని, వారి విద్వేషపూరిత రాజకీయాల వల్లే దేశం రెండు ముక్కలు అయ్యిందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేసిన ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న వారందరికి నివాళులు అర్పించారు. మన త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడుతుంటే, చిరునవ్వుతో ఉరి దాకా వెళ్లిన, బ్రిటీష్ సైనికుల తూటాలకు బలైపోయిన అసంఖ్యాక యోధుల, దేశభక్తుల త్యాగాలను గుర్తుచేస్తుందన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో అన్ని కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాల వారు పాల్గొన్నారని, అన్ని రాష్ట్రాలు, భాషలు, ప్రాంతాల ప్రజలు కలిసి బలమైన భారత దేశాన్ని నిర్మించారని చెబుతూ.. భిన్నత్వంలో ఏకత్వం మన బలం, బలహీనత కాదని స్పష్టం చేశారు.

అలాగే నేటి పాలకులు విప్లవకారుల కృషిని స్మరించుకోకుండా, వారి దార్శనికతను పాటించకుండా విభజన ఆలోచనను ప్రోత్సహిస్తున్నారని ఆరోపంచారు. విద్వేషాన్ని వ్యాప్తి చేయాలనే ఉద్దేశ్యంతో వారు "విభజన భయానక దినోత్సవం" జరుపుకుంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనని వారు కాంగ్రెస్ పార్టీకి సలహాలు ఇస్తారని, గోళ్లు కోసుకుని అమరవీరులం అన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. వారి విద్వేషపూరిత రాజకీయాలు దేశాన్ని రెండు ముక్కలు చేశాయన్నది చారిత్రక సత్యమని. వారి వల్లే ఈ విభజన జరిగిందని వ్యాఖ్యానించారు. సంఘ్ పరివార్ తన స్వార్థ ప్రయోజనాల కోసం "విభజించు మరియు పాలించు" అనే బ్రిటిష్ కుట్ర సిద్ధాంతాన్ని ఉద్దేశపూర్వకంగా ఎలా ప్రచారం చేసిందనేదానికి ఎటువంటి ఆధారాలు లేవని తెలిపారు.

ఇక మోడీ ప్రభుత్వం 2022 నుండి "హర్ ఘర్ తిరంగ" ప్రచారాన్ని నిర్వహిస్తోందని, ఆరు దశాబ్దాల తర్వాత వారు పశ్చాత్తాపం చెందాలని భావించినందుకు మాకు సంతోషమని అన్నారు. ఇప్పటికైనా తమ తప్పు తెలుసుకున్నారని, ఇంతకు ముందు వారు తమ కార్యాలయాలపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడానికి కూడా ఇష్టపడేవారు కాదని చెప్పారు. ఇందులో నిజమేమిటంటే, మన దేశ ప్రజలు గత 100 సంవత్సరాలుగా "హర్ దిల్ తిరంగ" మరియు "హర్ హత్ తిరంగ" పండుగలను జరుపుకుంటున్నారని తెలిపారు. 'కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి', 'కచ్‌ నుంచి కోహిమా' వరకు ఈ దేశం ఏకమై ఉందంటే అది 140 కోట్ల మంది ప్రజల ఐక్యత స్ఫూర్తి అని, రాహుల్ జీ భారత్ జోడో యాత్రలో ప్రపంచం మొత్తం ఆ స్ఫూర్తిని, త్రివర్ణ పతాకంలోని గర్వాన్ని చూసిందని ఖర్గే అన్నారు.

Tags:    

Similar News