Arsh Dalla : ఖలిస్తానీ తీవ్రవాది నిజ్జర్ సన్నిహితుడు అర్ష్ దల్లా అరెస్ట్
దిశ, నేషనల్ బ్యూరో : గతేడాది కెనడాలో హత్యకు గురైన ఖలిస్తానీ తీవ్రవాది(Khalistani terrorist) హర్దీప్‌సింగ్ నిజ్జర్ సన్నిహిత అనుచరుడు అర్ష్ దల్లా(Arsh Dalla) అలియాస్ అర్ష్‌దీప్ సింగ్‌ను కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో : గతేడాది కెనడాలో హత్యకు గురైన ఖలిస్తానీ తీవ్రవాది(Khalistani terrorist) హర్దీప్‌సింగ్ నిజ్జర్ సన్నిహిత అనుచరుడు అర్ష్ దల్లా(Arsh Dalla) అలియాస్ అర్ష్‌దీప్ సింగ్‌ను కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు. భారత జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మోస్ట్ వాంటెడ్ నేరగాళ్ల జాబితాలో అర్ష్ దల్లా పేరు కూడా ఉంది. అక్టోబరు చివరి వారంలో కెనడాలోని మిల్టన్ పట్టణంలో ఖలిస్తానీ తీవ్రవాదులు కాల్పులు జరిపిన ఘటన వెనుక అర్ష్ దల్లా ఉన్నాడని భారత నిఘా వర్గాలు గుర్తించాయి. దానిపై ప్రస్తుతం హాల్టన్ రీజియనల్ పోలీస్ సర్వీసు దర్యాప్తు చేస్తోంది. అర్ష్ దల్లా అరెస్టు విషయంలో కెనడా(Canada), భారత నిఘా సంస్థలు సమన్వయంతో పనిచేసినట్టు తెలుస్తోంది.
అర్ష్ దల్లా తన భార్యతో కలిసి దాదాపు గత నాలుగేళ్లుగా కెనడాలోనే ఉంటున్నాడు. ఖలిస్తానీ టైగర్ ఫోర్స్ అనే తీవ్రవాద సంస్థకు గతంలో హర్దీప్‌సింగ్ నిజ్జర్ సారథ్యం వహించేవాడు. గత సంవత్సరం నిజ్జర్ హత్యకు గురయ్యాక.. ఆ సంస్థను అర్ష్ దల్లా లీడ్ చేస్తున్నాడని విచారణలో గుర్తించారు. ఈ ఏడాది సెప్టెంబరులో పంజాబ్‌లోని మోగా జిల్లాలో కాంగ్రెస్ నేత బల్జిందర్ సింగ్ బల్లి హత్యకు గురయ్యారు. ఈ హత్యను చేయించింది తానేనని అప్పట్లో అర్ష్ దల్లా ప్రకటించుకున్నాడు. తన తల్లిని పోలీసులు కస్టడీలోకి తీసుకోవడానికి కారకుడు అయినందు వల్లే బల్జిందర్ సింగ్ బల్లిని మర్డర్ చేయించానని అర్ష్ దల్లా ప్రకటించడం ఆనాడు కలకలం రేపింది.