Kerala Monsoon: కేరళలో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్

కేరళలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Update: 2023-07-05 12:37 GMT

తిరువనంతపురం: కేరళలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం కూడా కుండపోత వానతో పలు ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోవడం, చెట్లు నేలకూలడం, నివాస, వాణిజ్య భవనాలు దెబ్బతినడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. రహదారులు జలమయమయ్యాయి. నదులు పొంగి పొర్లుతున్నాయి. పాతానం తిట్ట జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న నదిని దాటుతుండగా ఓ ఆటో రిక్షా బోల్తా పడింది. అందులో చిక్కుకున్న ఓ వ్యక్తి మృతి చెందాడు. కోజికోడ్ జిల్లాలోని తామరస్సెరి తాలూకాలో 68 ఏళ్ల వ్యక్తి నదిలో కొట్టుకుపోయాడు. కన్నూర్ జిల్లాలో సెంట్రల్ జైలు ప్రహరీ గోడ కూలిపోయింది.

రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, విద్యా సంస్థలు మూతబడ్డాయి. లోతట్టు ప్రాంత ప్రజలను సహాయక శిబిరాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రానున్న 3-5 రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలోని 14 జిల్లాలకు నాలుగు జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం రెడ్ అలెర్ట్ ప్రకటించింది. మరో 10 జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. వివిధ శాఖల ప్రతినిధులు, జాతీయ విపత్తు రెస్పాన్స్ ఫోర్స్‌తో రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్‌ను ప్రారంభించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్లలోకి నీరు చేరితే సహాయక శిబిరాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.


Similar News