Congress వైపు కేజ్రీవాల్ చూపు?

ఢిల్లీ మేయర్ ఎన్నిక ఉద్రిక్తతకు దారి తీసిన నేపథ్యంలో ఎంసీడీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహం మార్చబోతున్నట్టు తెలుస్తోంది

Update: 2023-01-09 08:11 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ మేయర్ ఎన్నిక ఉద్రిక్తతకు దారి తీసిన నేపథ్యంలో ఎంసీడీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహం మార్చబోతున్నట్టు తెలుస్తోంది. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ మద్దతును కోరే దిశగా అడుగులు వేస్తోందని తెలుస్తోంది. గత శుక్రవారం ఢిల్లీ మేయర్ ఎన్నిక ప్రక్రియ సందర్భంగా ఆమ్ ఆద్మీ, బీజేపీ సభ్యుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. మేయర్ ఎన్నిక కోసం సమావేశమైన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సభ్యుల మధ్య తోపులాట జరగడంతో ఎన్నిక ప్రక్రియ వాయిదా పడింది. అయితే మేయర్ తో పాటు డిప్యూటీ మేయర్ కు ఆమ్ ఆద్మీతో పాటు బీజేపీ సైతం అభ్యర్థులను ప్రకటించింది. ఈ క్రమంలో ఈ ఎన్నిక హోరాహోరాగా మారింది.

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 250 స్థానాలు ఉండగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 134 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ 104 స్థానాలు కాంగ్రెస్ 9 సీట్లలో విజయం సాధించింది. శుక్రవారం నాటి మేయర్ ఎన్నికలో కాంగ్రెస్ తటస్థంగా ఉండాలని నిర్ణయించుకుంది. అయితే అనూహ్యంగా ఈ ప్రక్రియ వాయిదా పడటం, ఈ పరిస్థితుల్లో బీజేపీకి చెక్ పెట్టాలంటే కాంగ్రెస్ మద్దతు కోరాలని ఆమ్ ఆద్మీ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ తమకు మద్దతు ఇస్తే బీజేపీ దూకుడు ఫుల్ స్టాప్ పెచ్చవచ్చని కేజ్రీవాల్ పార్టీ విశ్వసిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి ఓటింగ్ ప్రక్రియ నుంచి వైదొలగాలని కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం బీజేపీకి పరోక్ష మద్దతుగా మారిందని ఆప్ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నిర్ణయం ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తిగా మారింది. ఈ విషయంలో సీపీసీసీ అధ్యక్షుడు అనిల్ చౌదరి ఇప్పటికే తమ వైఖరిలో మార్పు ఉండదని స్పష్టం చేశారు. దీంతో మేయర్ ఎన్నికల్లో మద్దతు విషయంలో ఆమ్ ఆద్మీకి కాంగ్రెస్ నుంచి వ్యతిరేకత ఉండవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కాగా తదుపరి మేయర్ ఎన్నిక తేదీ ఎప్పుడు అనేది ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ త్వరలోనే ప్రకటించనున్నారు.

Also Read...

తప్పతాగి ఎయిర్‌హోస్టస్‌పై లైంగిక వేధింపులు?

Tags:    

Similar News