Iran- Israel: ఇరాన్‌లో అణు స్థావరాలు బయటపడ్డాయి- ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కాట్జ్
ఇరాన్- ఇజ్రాయెల్ (Iran- Israel) ఉద్రిక్తతలతో పశ్చిమాసియాలో హైటెన్షన్ నెలకొంది. కాగా.. ఇటీవల ఇజ్రాయెల్ రక్షణ మంత్రిగా నియమితులైన కాట్జ్ (Katz) కీలక ప్రకటన చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్- ఇజ్రాయెల్ (Iran- Israel) ఉద్రిక్తతలతో పశ్చిమాసియాలో హైటెన్షన్ నెలకొంది. కాగా.. ఇటీవల ఇజ్రాయెల్ రక్షణ మంత్రిగా నియమితులైన కాట్జ్ (Katz) కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌లో అణు స్థావరాలు (Iran nuclear site) బయటపడ్డాయని.. వాటినే లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. ‘ఇరాన్‌లో గతంలో కంటే చాలా అణు స్థావరాలు బయటపడ్డాయి. ముఖ్యమైన లక్ష్యాన్ని సాధించే అవకాశం కన్పిస్తోంది. ఇజ్రాయెల్ అస్థిత్వానికి కలిగే ముప్పును తొలగించడానికి, అడ్డుకోవడానికి ఇదే అవకాశం’ అని కాట్జ్ రాసుకొచ్చారు. మరోవైపు, ఇజ్రాయెల్ భవిష్యత్, భద్రత కోసం ఇరాన్ అణ్వాయుధాలకు అడ్డుకట్ట వేయాలని విదేశాంగ మంత్రి గిడియాన్ సార్ (Gideon Saar) పేర్కొన్నారు. ప్రధానమంత్రి నెతన్యాహు (Netanyahu), అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)ల మధ్య చర్చల్లో ఈ అంశం తెరపైకి వచ్చిన్నట్లు ఆయన తెలిపారు.
ఇరాన్ పై నిషేధం విధించిన ట్రంప్
ఇకపోతే, 2016లో అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ తన అణు కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. నిధులు సమకూర్చుకునేందుకు వీలు లేకుండా మధ్యప్రాచ్యం అంతటా తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతోపాటు టెహ్రాన్ చమురు పరిశ్రమలపై ఆంక్షలు విధించారు. కాగా.. ఈ ఏడాది అక్టోబరు 1న ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. వీటికి ప్రతీకారంగా ఇటీవల ఇరాన్‌లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా టెల్‌అవీవ్ వైమానిక దాడులు చేసింది. అయితే, ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించిన టెహ్రాన్ పై మరోసారి దాడికి ఐడీఎఫ్ రెడీ అవుతోంది.