హైకోర్టు సీజేకు సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి.. రేపే ప్రమాణం ?

దిశ, నేషనల్ బ్యూరో : కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రసన్న బి.వరలే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.

Update: 2024-01-24 16:38 GMT

దిశ, నేషనల్ బ్యూరో : కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రసన్న బి.వరలే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. గురువారం ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. గత నెలలో పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎస్.కె.కౌల్ స్థానంలో ఆయన నియమితులయ్యారు. దీంతో సుప్రీంకోర్టులోని మొత్తం 34 జడ్జి పోస్టులన్నీ భర్తీ అయ్యాయి. 61 ఏళ్ల జస్టిస్ ప్రసన్న బి.వరలే రెండు దశాబ్దాల పాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. తొలుత బాంబే హైకోర్టులో జడ్జిగా సేవలందించారు. అనంతరం 2022 అక్టోబరులో కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నెల ప్రారంభంలోనే సుప్రీంకోర్టు జడ్జి పోస్టు కోసం జస్టిస్ ప్రసన్న బి.వరలే పేరును సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ‘‘జస్టిస్ ప్రసన్న బి.వరలే అత్యంత సీనియర్ హైకోర్టు న్యాయమూర్తులలో ఒకరు. షెడ్యూల్డ్ కులానికి చెందిన ఏకైక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి’’ అని పేర్కొంది. ఈనేపథ్యంలో ఆయనకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి లభించడం గమనార్హం. ఈ నియామకంతో ఎస్సీ వర్గం నుంచి ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న మూడో సిట్టింగ్ జడ్జిగా జస్టిస్ ప్రసన్న బి.వరలే నిలిచారు. ఇప్పటికే ఎస్సీ వర్గం నుంచి జస్టిస్ బీఆర్ గవాయి, సీటీ రవికుమార్ సిట్టింగ్ జడ్జిలుగా ఉన్నారు. ‘‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 124లో ఉన్న క్లాజ్ (2) ద్వారా లభించిన అధికారాలను వినియోగించి కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రసన్న బాలచంద్ర వరలేను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించినందుకు రాష్ట్రపతి సంతోషిస్తున్నారు. బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి ఆయన హోదా అమల్లోకి వస్తుంది’’ అని పేర్కొంటూ కేంద్ర న్యాయ శాఖ ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Tags:    

Similar News