'ఓటుకు రూ. 6 వేలు ఇస్తాం'.. మాజీ మంత్రి వ్యాఖ్యలపై పార్టీ సీరియస్
కర్ణాటకకు చెందిన జలవనరుల శాఖ మాజీ బీజేపీ మంత్రి రమేష్ జర్కిహోలి పార్టీ ఆగ్రహానికి గురయ్యారు.
బెంగళూరు: కర్ణాటకకు చెందిన జలవనరుల శాఖ మాజీ బీజేపీ మంత్రి రమేష్ జర్కిహోలి పార్టీ ఆగ్రహానికి గురయ్యారు. వివాదాస్పద వ్యాఖ్యలతో ఆ పార్టీని ఇరకాటంలో పడేశారు. మేలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుకు రూ. 6 వేలు ఇస్తామని రమేష్ చెప్పారు. 2021లో ఈ మాజీ మంత్రిపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో పార్టీ ఆయనను బలవంతంగా రాజీనామా చేయించింది. బెలగావిలోని సులెబావి గ్రామంలో ఆయన మద్దతు దారులు ఒక ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బల్కర్‌పై దాడి చేసే క్రమంలో మాజీ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
బెలగావి జిల్లాలోని బెలగావి గ్రామీణ నియోజయవర్గానికి కాంగ్రెస్‌కు చెందిన లక్ష్మి హెబ్బల్కర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 'తన నియోజకవర్గంలోని ఓటర్లకు ఆమె గిఫ్ట్‌లు పంచుతోంది. రూ. 1000 విలువ చేసే కుక్కర్, మిక్సర్ వంటి వంట సామాన్లను ఆమె ఇస్తోంది. మరోసారి ఆమె గిఫ్ట్‌లను పంచాలని భావిస్తోంది. అంతా కలిపితే వాటి విలువ రూ. 3000 కావచ్చు. అయితే మేము రూ. 6 వేలు ఇస్తాం. ఈ డబ్బులు ఇవ్వకపోతే మా అభ్యర్థికి ఓటు వేయొద్దని అభ్యర్థిస్తున్నాను' అని రమేష్ జర్కిహోలి చెప్పారు.