JP Nadda: ఎట్టకేలకు దొరికిన జేపీ నడ్డా సతీమణి కారు.. ఢిల్లీలో మాయమై ఆ ప్రాంతంలో ప్రత్యక్షం
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సతీమణి కారు చోరీకి గురైన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనమైంది.
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సతీమణి కారు చోరీకి గురైన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనమైంది. అయితే, ఎట్టకేలకు ఆ కారును పోలీసులు కనిపెట్టారు. ఢిల్లీలో మాయమైన కారు వారణాసిలో ప్రత్యక్షమైంది. ఈ మేరకు కారును ఎత్తుకెళ్లిన ఇద్దరు దుండగులను పోలీసులు అరెస్టు చేశారు. ఫరిదాబాద్ సమీపంలోని బద్కల్‌కు చెందిన షాహిద్, షివంగ్ త్రిపాఠి అనే ఇద్దరు దొంగలు ఆ కారును వారణాసికి తీసుకెళ్లినట్లుగా పోలీసులు తెలిపారు. కారు నెంబర్ ప్లేట్ ఛేంజ్ చేసి అనంతరం అలీగఢ్, లఖింపూర్ ఖేరి, బరేలి, సీతాపూర్, లక్నో మీదుగా వారణాసికి తీసుకెళ్లారని పోలీసులు వెల్లడించారు.
కాగా, నడ్డా భార్య మల్లికాకు చెందిన ఫార్చునర్ కారును మార్చి 19న నడ్డా డ్రైవర్ సర్వీస్ సెంటర్‌లో పెట్టి భోజనం చేసేందుకు బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న దొంగలు కారుతో అక్కడి నుంచి ఉడాయించారు. ఈ మేరకు కారు డ్రైవర్ జోగిందర్ సింగ్ గోవింద్‌పురి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు. సీసీ ఫుటేజ్ సాయంతో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.