Arvind Kejriwal: ఇండియా కూటమికి షాక్.. ఒంటరి పోరుకు సిద్ధమన్న ఆప్
దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఇండియా కూటమికి షాక్ తగిలింది.
దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఇండియా కూటమికి షాక్ తగిలింది. ఇండియా కూటమితో పొత్తుకు సిద్దంగా లేవని అమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రకటించింది. ఒంటరిగానే పోటీ చేస్తామని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ప్రకటించారు. ‘‘ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పొత్తులకు దూరంగా ఉంటుంది. ఒంటరి పోరుకు సిద్ధం అవుతోంది’’ అని స్పష్టం చేశారు. ఇకపోతే, ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా పంజాబ్‌లో కాంగ్రెస్‌తో పొత్తుకు ఆప్ నిరాకరించింది. 13 స్థానాల్లో ఒంటరిగా బరిలోకి దిగింది. మరోవైపు, ఢిల్లీ ఎన్నికల్లో పొత్తు లేకుండా పోటీ చేస్తామని ఇప్పటికే కాంగ్రెస్ కూడా ప్రకటించింది.
కేజ్రీవాల్ పై దాడి
కాగా.. సౌత్ ఢిల్లీలోని మాలవీయ నగర్‌లో పాదయాత్ర చేస్తున్న కేజ్రీవాల్ పై గుర్తుతెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డారు. భద్రతా సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించడంతో నిందితుడిని అడ్డుకున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఇక, ఈ దాడిపై కేజ్రీవాల్ స్పందించారు. ఢిల్లీ శాంతి భద్రత అంశాన్ని లేవనెత్తితే తనపై దాడి చేస్తారా అని ప్రశ్నించారు. కేంద్రమంత్రి అమిత్ షా ఈ విషయంలో చర్యలు తీసుకుంటారని ఆశించాను. కానీ, దానికి బదులు పాదయాత్రలో తనపైనే దాడి జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. వీలైతే.. గ్యాంగ్‌స్టర్లను అరెస్టు చేయించాలి కానీ, తమని ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారని ప్రశ్నించారు.