బిహార్‌లోకి ప్రవేశించిన జోడో న్యాయ్ యాత్ర

బిహార్ సీఎం నితీశ్ కుమార్ మహాఘట్‌బంధన్ ప్రభుత్వాన్ని పడగొట్టి, ఎన్డీయే కూటమిలో చేరిన ఒక రోజు తర్వాత రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో న్యాయ్ యాత్ర బిహార్‌లోకి ప్రవేశించింది.

Update: 2024-01-29 06:40 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్ సీఎం నితీశ్ కుమార్ మహాఘట్‌బంధన్ ప్రభుత్వాన్ని పడగొట్టి, ఎన్డీయే కూటమిలో చేరిన ఒక రోజు తర్వాత రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో న్యాయ్ యాత్ర బిహార్‌లోకి ప్రవేశించింది. సోమవారం బెంగాల్‌లోని ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలోని సోనాపూర్‌లో ప్రారంభమైన యాత్ర కిషన్ గంజ్ జిల్లా మీదుగా బిహార్‌కు చేరుకుంది. ఇది ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లా. అంతేగాక కాంగ్రెస్‌కు కంచుకోట లాంటిది. 2020 అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ బిహార్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. రాష్ట్రంలో కాంగ్రెస్ మిత్ర పక్షాలైన రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, సీపీఐఎంఎల్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్యలను న్యాయ్ యాత్రలో పాల్గొనాలని కాంగ్రెస్ ఆహ్వానించింది. బిహార్‌లో రాజకీయ పరిణామాల నేపథ్యంలో యాత్ర రాష్ట్రంలోకి ప్రవేశించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, పశ్చిమ బెంగాల్‌లోకి న్యాయ్ యాత్ర ప్రవేశించే ఒక రోజు ముందు పార్లమెంటు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని మమతా బెనర్జీ ప్రకటించగా.. తాజాగా బిహార్‌లోకి ఎంటర్ అయ్యే ఒక రోజు ముందు నితీశ్ కూటమి నుంచి వైదొలగడం గమనార్హం.

ఈడీ ఎదుట హాజరైన ఆర్జేడీ చీఫ్

జోడో న్యాయ్ యాత్ర బిహార్‌లోకి ప్రవేశించిన నేపథ్యంలో.. ల్యాండ్ ఫర్ జాబ్ కుంభకోణానికి సంబంధించిన కేసు విచారణలో భాగంగా ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ పాట్నాలోని ఈడీ కార్యాలయంలో ఇన్వెస్టిగేషన్‌కు హాజరయ్యారు. దీంతో ఈడీ కార్యాలయం ఎదుట ఆర్జేడీ కార్యకర్తలు నిరసన తెలిపగా.. ఈడీ ఆఫీస్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జనవరి 19న లాలూ, అతని కుమారుడు తేజస్వి యాదవ్‌లకు అధికారులు సమన్లు జారీ చేశారు. లాలూ భార్య, మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, కుమార్తె మిసాలు కూడా ఈ కేసులో నిందితులుగా ఉన్నారు.

Tags:    

Similar News