రామాలయం ప్రారంభోత్సవంలో 30 ఏళ్ల మౌనం వీడనున్న మహిళ
మౌనవ్రత దీక్షను విరమించనున్న 85 ఏళ్ల సరస్వతి దేవీ
దిశ, నేషనల్ బ్యూరో: శ్రీరాముడంటే ఎవరికైనా ఎనలేని ప్రేమ, భక్తి ఉంటుంది. పురాణంలో శబరి వల్లమాలిన అభిమానం రాముణ్ణి ఆమె గుడిసె వద్దకు చేర్చితే, ఈ తరంలో సరస్వతి దేవీ భక్తి రాముడి ఆలయాన్ని సాకారం చేసింది. ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్‌కు చెందిన 85 ఏళ్ల సరస్వతి దేవీకి శ్రీరాముడు అంటే ఎంతో భక్తి. 1992లో బాబ్రీ మసీదును కూల్చిన అనంతరం ఆమె అయోధ్య సందర్శనకు వెళ్లారు. ఆ సమయంలో ఎంతో కలత చెందిన ఆమె, ఆ ప్రదేశంలో తిరిగి రామ మందిరాన్ని నిర్మించే వరకు మౌనవ్రతం చేస్తానని శపథం చేశారు. ఆరోజు నుంచి 23 గంటల పాటు ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నారు. తనకు ఏదైనా కావాలనుకుంటే సైగలతో అడిగేవారు. రోజులో ఒక గంట మాత్రమే కుటుంబ సభ్యులతో మాట్లాడేవారు. తాజాగా, 2020లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించేందుకు భూమి పూజ చేయడంతో ఆమె మౌనవ్రత దీక్ష ఇన్నాళ్లకు ఫలించినట్టు అయింది. ఈ నెల 22న జరగనున్న రామమందిర ప్రారంభోత్సవం కోసం ఆమెకు ఆహ్వానం అందింది. ఇప్పటికే అయోధ్యకు బయలుదేరిన సరస్వతి దేవీ ప్రాణప్రతిష్ట అనంతరం తన మౌనవ్రతాన్ని వీడనున్నట్టు ఆమె కుటుంబసభ్యులు తెలిపారు.
సరస్వతీ దేవి ఎవరు?
ఝార్ఖండ్‌కు చెందిన సరస్వతీ దేవి, 1986లో తన భర్త దేవకినందన్ అగర్వాల్ మరణానంతరం తీర్థయాత్రలలో కాలాన్ని గడిపారు. తన జీవితాన్ని రాముడికే అంకితం చేస్తూ జీవించారు. అయోధ్యలో 'మౌని మాత'గా ప్రసిద్ధి చెందిన ఆమె ప్రస్తుతం ధన్‌బాద్‌లోని ధైయాలో కోల్ ఇండియా అనుబంధ సంస్థ అయిన భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్)లో పనిచేస్తున్న తన రెండవ పెద్ద కుమారుడు నంద్ లాల్ అగర్వాల్ వద్ద నివశిస్తున్నారు. శ్రీరాముడి స్మరణకే తన జీవితాన్ని అంకితం చేసిన సరస్వతి దేవీ, ఆలయ నిర్మాణం పూర్తి కావడంతో సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. 'నా జీవితం ధన్యమైంది. ప్రాణ ప్రతిష్టలో పాల్గొనేందుకు రాముడు నన్ను ఆహ్వానించాడు.ఇన్నాళ్ల తపస్సు ఫలించింది. 30 ఏళ్ల తర్వాత నా మౌనం వీడనుంది. ఇకపై మహంత్ నృత్య గోపాల్ దాస్ ఆశ్రమంలోనే ఉండిపోవాలని కోరుకుంటున్నట్టు' సరస్వతి దేవీ మీడియాకు చెప్పారు.
కాగా, అయోధ్యలో ఆలయ ప్రాణప్రతిష్ట మహోత్సవం కోసం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రామమందిరంలో 5,500 కిలోల భారీ ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించనున్నారు. ఇది 44 అడుగుల పొడవు, 9.5 అంగుళాల వ్యాసంతో నిర్మించబడింది. ఈ నెల 8న(సోమవారం) దీన్నీ అయోధ్యకు తీసుకొచ్చారు.