మా వాళ్లను వదిలేయండి.. ఇరాన్‌‌తో జైశంకర్ చర్చలు

ఇరాన్ ఆర్థికమంత్రి అమిరబ్దుల్లాహియాన్ తో విదేశాంగమంత్రి జైశంకర్ సంప్రదింపులు జరిపారు. ఇరాన్ సైనికులు స్వాధీనం చేసుకున్న కార్గో షిప్‌లోని భారత సిబ్బందిని విడుదల చేయాలని కోరారు.

Update: 2024-04-14 18:11 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్ ఆర్థికమంత్రి అమిరబ్దుల్లాహియాన్ తో విదేశాంగమంత్రి జైశంకర్ సంప్రదింపులు జరిపారు. ఇరాన్ సైనికులు స్వాధీనం చేసుకున్న కార్గో షిప్‌లోని భారత సిబ్బందిని విడుదల చేయాలని కోరారు. 25 మంది సభ్యుల కార్గో షిప్ ను ఇరాన్ స్వాధీనం చేసుకోగా.. అందులో 17 మంది భారత సిబ్బంది ఉన్నారు. ఇరాన్ ప్రస్తుత పరిస్థితి గురించి అమిరబ్దుల్లాహియాన్ తో చర్చించినట్లు సోషల్ మీడియా ఎక్స్ లో తెలిపారు జైశంకర్. సంయమనం పాటించి, దౌత్యం ద్వారా సమస్యలను పరిష్కారించుకుందామని తెలిపనట్లు పేర్కొన్నారు జైశంకర్.

శనివారం హర్మూజ్ జలసంధి సమీపంలో ఇజ్రాయెలీ కుబేరుడు ఇయాల్ ఒఫర్ కు చెందిన కార్గో షిప్ ను ఇరాన్ అదుపులోకి తీసుకుంది. పోర్చుగీసు జెండాతో ప్రయాణిస్తున్న ఈ నౌకను హర్మూజ్‌ జలసంధికి దగ్గరకు రాగానే ఐఆర్‌జీసీ ప్రత్యేక కమాండోలు చుట్టుముట్టారు. హెలికాప్టర్‌ నుంచి నౌకపైకి దిగారు. సిబ్బందిని అదుపులోకి తీసుకొని నౌకను తమ ప్రాదేశిక జలాలవైపునకు మళ్లించారు. ఈ ఘటన జరిగిన కొద్ది గంటలకే భారత ప్రభుత్వం అలెర్టయ్యింది. 17 మంది భారతీయులను రక్షించడానికి భారత్‌ రంగంలోకి దిగింది. దౌత్యమార్గాల్లో ఇరాన్‌తో సంప్రదింపులు ప్రారంభించింది.


Similar News