China :‘భారత్-చైనా’ మధ్యలో మరో దేశం అక్కర్లేదు : జైశంకర్

దిశ, నేషనల్ బ్యూరో : చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలను పరిష్కరించుకునే విషయంలో తాము ఇతర దేశాల సహకారాన్ని ఆశించడం లేదని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు.

Update: 2024-07-29 12:27 GMT

దిశ, నేషనల్ బ్యూరో : చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలను పరిష్కరించుకునే విషయంలో తాము ఇతర దేశాల సహకారాన్ని ఆశించడం లేదని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. ‘‘చైనా, భారత్‌లు పెద్దదేశాలు కావడంతో మా సరిహద్దు సమస్యపై సహజంగానే ఇతర దేశాలు ఆసక్తిని కలిగి ఉంటాయి. మా రెండు దేశాల మధ్య చోటుచేసుకునే పరిణామాల ప్రభావం ప్రపంచంలోని ఇతర ప్రాంతాలపైనా పడుతుంది. అయితే ఇతర దేశాలకు ఈవిషయంలో జోక్యం చేసుకునే అవకాశం ఇవ్వాలని మేం భావించడం లేదు’’ అని ఆయన తేల్చి చెప్పారు. క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు జపాన్‌లోని టోక్యోకు చేరుకున్న జైశంకర్.. సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

“గత అనుభవాల ఆధారంగా చైనాపై మాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. చైనాతో మన సంబంధాలు అంత బాగా లేవు. మాతో కుదుర్చుకున్న కొన్ని సరిహద్దు ఒప్పందాలను 2020లో కరోనా సమయంలో చైనా ఉల్లంఘించింది. పెద్దసంఖ్యలో బలగాలను భారత సరిహద్దుల్లో మోహరించింది. దీంతో అప్పట్లో సరిహద్దుల్లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇరువైపులా సైనికుల ప్రాణనష్టం జరిగింది’’ అని జైశంకర్ వివరించారు. ‘‘ఆ సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. పొరుగుదేశాల నుంచి మేం స్నేహపూర్వక సంబంధాన్ని ఆశిస్తున్నాం. అయితే ఎల్‌ఓసీని చైనా గౌరవించాలి. గతంలో వాళ్లు భారత్‌తో కలిసి సంతకం చేసిన ఒప్పందాలను గౌరవించాలి. అప్పుడే చైనా-భారత్ మధ్య స్నేహసంబంధాలు సాధ్యమవుతాయి’’ అని ఆయన చెప్పారు. కాగా, క్వాడ్ కూటమిలో అమెరికా, జపాన్, భారత్, ఆస్ట్రేలియా దేశాలు ఉన్నాయి.

Tags:    

Similar News